● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్‌ఎస్‌కు 155 ఫిర్యాదులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే ప్రతి అర్జీని అధికారులు బాధ్యతాయుతంగా స్వీకరించి, నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి అధికారులు స్పందించాలని, జాప్యానికి తావులేకుండా శాశ్వత పరిష్కారం చూపి అర్జీదారుల సంతప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా మొత్తం 155 ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ (సీసీఎల్‌ఏ) శాఖకు సంబంధించి 55, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 17, పంచాయతీ రాజ్ శాఖకు 15, సెర్ప్ విభాగంలో 11 వినతులు అందాయి. అదేవిధంగా సర్వే సెటిల్‌మెంట్స్ శాఖకు 6, గిరిజన సంక్షేమం, విద్యుత్ శాఖలకు చెరో 5 చొప్పున అర్జీలు వచ్చాయి. వీటితో పాటు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వర్ణ గ్రామం, జలవనరులు, గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, వ్యవసాయం, విద్యాశాఖ సహా మొత్తం 28 వివిధ విభాగాలకు చెందిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమా ర్, జెడ్పీ సీఈవో వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు.
●రైతులు ఆవుల నుంచి తీసిన పాల ధరలు తక్కువగా ఉన్నాయని, పాల ధరను పెంచాలని ఎంజేఆర్ పూలే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాల రైతులు పీజీఆర్‌ఎస్‌లో సోమవారం వినతిపత్రం అందజేశారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ఈదురుగాలులు, వడగండ్ల వానలకు సోంపేట మండలం జింకిబద్ర, బెంకిలి, పలాసపురం గ్రామాల్లో పంటనష్టం జరిగిన రైతులకు ఆదుకోవాలని కోరారు.
●ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం పంచాయతీలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారని, తక్షణమే ప్రభుత్వపరంగా ఆరోగ్య శాఖ తనిఖీలు చేసి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు తదితరులు కోరారు.
●శ్రీకాకుళం నగరంలోని విశాఖ–బీ కాలనీలో మురుగునీరు నిల్వ ఉంటోందని, దీనివలన రోగాలబారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సమస్యపై ఆరుసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోయిందని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
●తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని శ్రీకాకుళం నగరంలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన విద్యార్థులు ఎస్.మానస, మోహనకృష్ణలు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమ తల్లిని కొట్టి, తమపై అక్రమ కేసులు పెట్టి సూరపు ఉష తదితరులు వేధిస్తున్నారని వాపోయారు.
●అర్హతలు లేకపోయినా, స్థానికులు కాకపోయినా మత్స్యకార భరోసా పథకంలో గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారని పోలాకి మండలం అంపలాం, రాజపురం గ్రామాలకు చెందిన ఎం.సూరిబాబు తదితర పలువురు మత్స్యకారులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సుమారుగా రూ.లక్ష కోట్ల నగదు అవినీతి చేసేందుకు సిద్ధమవుతున్నారని, ఇప్పటికే అడ్డగోలుగా 24 మందిని ఈ పథకంలో చేర్పించారని తెలిపారు. ఇటువంటి వాటిని అరికట్టాలని, వాస్తవ మత్స్యకారులకు పథకం అందించాలని కోరారు.
ఆమదాలవలస మండలం తోటాడ గ్రామంలోని నారాయణపురం ఆనకట్ట ఎడమ ప్రధాన కాలువ పరిధి మిర్తి బట్టి ఉప కాలువ కట్టపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ సత్యప్రసాద్ తదితరులు కోరారు. ఈ కాలువ శ్రీకాకుళం, ఆమదాలవలస మండలాల్లోని సుమారు 500 ఎకరాల ఆయకట్టు భూములకు ఇది ప్రధాన సాగునీటి వనరు అని తెలిపారు. ఇటువంటి ఆక్రమణలు కాలువ నిర్వహణకు ఆటంకం కలిగించడమే కాకుండా, కాలువ గట్టును బలహీనపరుస్తాయని పేర్కొన్నారు. సకాలంలో చర్యలు తీసుకోకపోతే రైతులకు నష్టాలు వస్తాయన్నారు. ప్రభుత్వ ఆస్తిని అనధికారికంగా ఆక్రమించిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సరిహద్దు రాళ్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. కాలువ కట్టకు నిరంతరం రక్షణ కల్పించాలని విన్నవించారు.


