ఎచ్చెర్ల:
మండలంలోని బైపాస్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఒక బొగ్గు లారీ టైర్ పంక్చర్ అవ్వడంతో రోడ్డుపై ఆగిపోయింది. దీనిని గమనించని జార్ఖండ్ నుంచి చైన్నె వెళ్తున్న ఇనుప లోడు లారీ ఆగిఉన్న లారీని బలంగా ఢీకొంది. దీంతో వెనుక భాగాన లారీ చొచ్చుకుపోవడంతో నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న క్లీన ర్, డ్రైవర్ ఇద్దరూ చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. దీనికి గమనించిన స్థానికులు వీరిని రక్షించేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటికి పోలీసులు చేరుకుని రెండు లారీను వేరుచేసి వీరిని బయటకు తీశారు. గాయపడిన జార్ఖండ్‌కు చెందిన డ్రైవర్ ముబారక్ అన్సారీ, క్లీనర్ మీనాక్ అన్సారీలను చికిత్స నిమిత్తం 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటన వలన జాతీయ రహదారిపై చాలాసేపు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


