సాక్షి, పుట్టపర్తి: బెంగళూరు – పెనుకొండ జాతీయ రహదారి రేసింగ్‌లకు అడ్డాగా మారింది. కొందరు యువకులు బైక్‌లతో ప్రమాదకర ఫీట్లు, స్టంట్లు చేస్తున్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలను కొనితెచ్చుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా హరించే దుస్థితిని కల్పిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ వ్యూవ్స్, లైక్స్ కోసం దేనికైనా తెగిస్తున్నారు. వారాంతపు రోజుల్లో బెంగళూరు నుంచి బుల్లెట్ బైకుల్లో రయ్ .. రయ్ మంటూ మెరుపు వేగంతో కొందరు గుంపుగా కొడికొండ చెక్‌పోస్టు, లేపాక్షి.. అటు నుంచి పెనుకొండ కోట వరకూ వచ్చి వెళ్తుంటారు. బెంగళూరు నుంచి గంటలోపే కొడికొండ చెక్‌పోస్టు చేరుకుంటారు. అక్కడి నుంచి లేపాక్షి వరకూ వెళ్లి.. ఆలయాన్ని సందర్శించుకొని ఆ తర్వాత పెనుకొండ కోటపైకి వెళ్తారు. తిరుగు పయనంలో మరింత వేగంతో దూసుకెళ్తున్నారు.
యువకులే అధికం
కంటెంట్ ఎలా ఉన్నా.. ఒక్క వీడియో వైరల్ అయితే రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు. ఫాలోవర్లు పెరిగితే ప్రమోషన్లతో పాటు డబ్బు సంపాదించవచ్చు. అంతకు మించి నలుగురిలో ప్రత్యేకంగా ఉండవచ్చు. ఇలా కారణం ఏదైనా.. మద్యం, జూదం, గంజాయికి బానిస అవుతున్న తరహాలోనే చాలామంది యువత తెలిసీ తెలియని వయసులో రీల్స్ మోజుతో ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తున్నారు. నిరంతరం ఏదో రూపంలో గుర్తింపు పొందాలనే భావనతో పోస్ట్ చేసిన వెంటనే లైక్‌లు, వ్యూవ్స్ రాకపోతే ఒత్తిడికి లోనవుతున్న వారు కూడా ఉన్నారు. బైక్ రేసింగ్‌లలో పాల్గొనే వారిలో 15 – 25 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉంటున్నారు.
జాతీయ రహదారుల్లో
బైక్ రేసింగ్‌లు
బెంగళూరు నుంచి
లేపాక్షి, పెనుకొండ వరకూ..
స్పోర్ట్స్ బైకుల్లో వందకు పైగా స్పీడ్‌తో దూసుకెళ్తున్న వైనం
సోషల్ మీడియాపై మోజుతో పెడదోవ
పోలీసుల ప్రత్యేక నిఘా
ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. పలువురు ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడుతూ జరిమానా రూపంలో భారీగా మూల్యం చెల్లించుకుంటున్నారు. పదే పదే పట్టుబడితే సెక్షన్ – 125, 184 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు కూడా పంపవచ్చు. అధిక శబ్ధం చేసే పొగ గొట్టాలతో రోడ్డెక్కితే మూల్యం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
బెంగళూరు నుంచి బుల్లెట్ బైకుల్లో అతి వేగంగా అధిక శబ్ధాలతో వస్తున్న 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. అక్కడికక్కడే మెకానిక్ షాపునకు తీసుకెళ్లి.. సైలెన్సర్లు తీయించారు. అలాగే కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించారు. ఆ తర్వాత వారు జరిమానా చెల్లించి వాహనాలు తీసుకెళ్లారు. ఈ ఘటన గతేడాది నవంబరులో పెనుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
లేపాక్షికి రావాలని కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు బెంగళూరు నుంచి బయలు దేరారు. అతి వేగంతో వస్తూ.. ఒక చేతిలో మొబైల్ పట్టుకుని వీడియోలు తీస్తుండగా కొడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అందరికీ జరిమానా వేసి పంపించారు. తిరుగు ప్రయాణంలో నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. పోలీసులు గస్తీ నిర్వహించగా తిరుగు ప్రయాణంలోనూ పట్టుబడ్డారు. ఈ ఘటన మూడు నెలల క్రితం వెలుగు చూసింది.
తల్లిదండ్రులపైనా కేసులు
చాలా మంది రేసర్లు వారి తల్లిదండ్రుల వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినా.. లైసెన్సు లేని వారు బైక్‌లతో పట్టుబడినా తీవ్ర పరిణామాలు ఉంటాయి. బైకర్‌తో పాటు వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తాం.
– ఎస్.సతీశ్ కుమార్, జిల్లా ఎస్‌పీ


