పుట్టపర్తి అర్బన్: ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా జిల్లా అధికారులు, బీఎల్‌ఓలు చేపట్టిన ఇంటింటి సర్వే ఈనెల 24తో పూర్తి కానుండగా నాలుగు రోజుల ముందే లెక్క తేలింది. జిల్లాలో 14,23,839 మంది ఓటర్లను గుర్తించిన ఎన్నికల సంఘం వారికి ఎన్యుమరేషన్ ఫారాలు అందించడం, సేకరించడం పూర్తి చేసి డిజిటలైజేషన్ కూడా పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఇందు కోసం జిల్లాలో 1576 మంది బీఎల్‌ఓలు నెల రోజుల పాటు రేయింబవళ్లు పని చేశారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓలు తనిఖీలు చేపట్టి సర్ కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. ఈఎఫ్ ఫారాలు డిజిటలైజేషన్ ఈనెల 24తో ముగియాల్సి ఉన్నా... ఇంకా నాలుగు రోజుల సమయం ఉండగానే వాటి లెక్క తేల్చి మీడియాకు వివరాలు తెలియజేశారు.
1,19,108 మంది ఓటర్లు ఎక్కడ?
జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, కదిరి, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో 14,23,839 మంది ఓటర్లలో 1,19,108 మంది ఓటర్ల ఆచూకీ తెలియడం లేదు. ఇందులో జిల్లా నుంచి శాశ్వతంగా వలస వెళ్లి వారు 45,562 మంది ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలోనో లేక ఇతర రాష్ట్రాల్లోనో ఓటు హక్కు ఉన్నట్లు గుర్తించిన వారు 30,070 మందిగా, ఆచూకీ లేని వారిగా 33,476 మంది ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే మృతి చెందిన వారు 53,791 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇతరుల కింద 305 మంది ఉన్నారంటున్నారు. హిందూపురం నియోజకవర్గంలో అత్యధికంగా 16,385 మంది ఓటర్లు పత్తా లేనట్లు గుర్తించారు. అలాగే ఇక్కడే 7,615 మందికి డబుల్ ఓట్లు ఉన్నట్లు తేల్చారు. కదిరి నియోజక వర్గంలో శాశ్వత వలస ఓటర్లుగా సుమారు 10 వేల మందిని చూపారు. ఇందులో చాలా వరకూ బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లకుండానే వివరాలు సేకరించారన్న విమర్శలున్నాయి.
అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఓటర్ల సంఖ్యకు ప్రస్తుతం సర్ కార్యక్రమంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ల సంఖ్యకు తేడా ఉంది. గతంలో 14,06,204 మంది, ఇతరుల కింద 76 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సర్ కార్యక్రమంలో స్త్రీ,పురుష ఓటర్లు 14,23,839 ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ, ఇప్పటి సుమారు 17,635 ఓట్లు పెరిగినట్లు చూపారు. ఇతరుల కింద 305 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోరు. ఇంత వ్యత్యాసం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. తప్పొప్పులు సరి దిద్దుకునేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.
24తో ముగియనున్న ఇంటింటి సర్వే
వందశాతం డిజిటలైజేషన్ పూర్తి
పత్తా లేని 1,19,108 మంది ఓటర్లు


