పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని పది, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరుతో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈఓ కిష్టప్ప ఒక ప్రకటనలో తెలిపారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మాహి శ్రీనివాస గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మండలం నుంచి ఆరుగురిని ఎంపిక చేశామన్నారు. ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ విద్యార్థులతో పాటు జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని 32 మండలాల నుంచి మొత్తం 195 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన విజేతలకు మెడల్, ప్రశంసాపత్రం, రూ.20 వేలు నగదు బహుమతి (చెక్ రూపంలో) అందిస్తామన్నారు.
పలు మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. గాలివేగం తగ్గడంతో కొంత సేపు వర్షం పడింది. పుట్టపర్తి, పెనుకొండ, కొత్తచెరువు, నల్లమాడ, ముదిగుబ్బ, ఓడీసీ తదితర మండలాల్లో తుంపర కురిసింది. ఒకటి రెండు చోట్ల మాత్రం మోస్తరు వర్షం వచ్చింది. అయితే ఈ వర్షంతో ఎలాంటి ఉపయోగం లేదని రైతులు చెబుతున్నారు. కనీసం చెట్ల కింద కూడా నానడం లేదన్నారు. పంటలు సాగు చేసిన రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై అన్నదాతల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
పోలీసులకే బురిడీ
● లాకప్ నుంచి తప్పించుకున్న నిందితుడు
కదిరి టౌన్: ఓ చోరీ కేసులో పట్టుబడిన నిందితుడు పోలీసులనే బురిడీ కొట్టించాడు. ఏకంగా పోలీసుస్టేషన్‌లోని లాకప్ నుంచి పరారయ్యాడు. కదిరి పట్టణ పోలీసుస్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఈ మధ్యనే పట్టణంలోని శివాలయంలో హుండీ పగలకొట్టి నగదు చోరీ చేసిన ఘటనలో మేకల నరసింహులు అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పట్టణ పోలీసుస్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు. అయితే పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మేకల నరసింహులు లాకప్ నుంచి పరారయ్యాడు. లాకప్‌కు తాళాలు వేయకపోవడంతో శనివారం మధ్యాహ్నం సమయంలో నిందితుడు సులువుగా తప్పించుకున్నాడని తెలుస్తోంది. విధుల్లో ఉన్న సిబ్బంది ఆ సమయంలో అసలు పోలీసుస్టేషన్‌లో ఉన్నారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే లాకప్‌లో ఉన్న నిందితుడు పారిపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.
ముత్యాలమ్మ
ఆలయ సమీపంలో పేకాట
రామగిరి: మండలంలో ప్రసిద్ధిగాంచిన నసనకోట ముత్యాలమ్మ ఆలయ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. 18 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,06,030 నగదు, 16 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మహమ్మద్ అలీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ముత్యాలమ్మ ఆలయ సమీపంలో కొన్ని నెలలుగా భారీస్థాయిలో పేకాట జరుగుతోంది. ఈ ఆలయం ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోనూ అత్యంత ప్రసిద్ధి గాంచడంతో ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇదే అదనుగా అక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు రావడంతో ఆదివారం దాడి చేశారు. జూదరులను అరెస్టు చేసి.. నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎస్‌ఐ ప్రదీప్‌రాజ్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


