చెక్‌ బౌన్స్‌ కేసులపై ప్రత్యేక లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

చెక్‌ బౌన్స్‌ కేసులపై ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Jul 19 2026 12:09 AM | Updated on Jul 19 2026 12:09 AM

అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో చెక్‌బౌన్స్‌ కేసులపై శనివారం ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ప్రత్యేక లోక్‌ అదాలత్‌కు అనంతపురము కోర్టు ప్రాంగణంలో మూడు బెంచులు ఏర్పాటు చేశారు. 47 చెక్‌ బౌన్స్‌ కేసుల్లో రూ. 36,62,000 మేర పరిష్కరించినట్టు ఉమ్మడి జిల్లా ప్రధాన జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్‌ ఈ. భీమారావు తెలిపారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్‌ శాశ్వత చైర్‌పర్సన్‌ శైలజాదేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌. రాజశేఖర్‌, న్యాయసేవాధికార సంస్థ సభ్యులు సి. భాగ్య, ఎన్‌.రాధ తదితరులు పాల్గొన్నారు.

దీన్ని కోడిగుడ్డు అంటారా?

మంత్రి సవిత ఆగ్రహం

రొద్దం: ‘‘ఇదేంది... దీన్ని కోడిగుడ్డు అంటారా..మరి ఇంత చిన్నగా ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఎన్ని గ్రాములు ఉండాలి... ఎంత ఉంది’’ అంటూ బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌తో కలిసి మండల పరిధిలోని తురకలాపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులతో ఆరాతీశారు. కోడిగుడ్లు పరిమాణం తక్కువగా ఉందని, భోజనం కూడా సరిగా లేదని తెలుస్తోందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడిస్తే సహించేది లేదన్నారు. ఇకపై ఇలాంటివి తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

బెట్ట పరిస్థితులను

తట్టుకునే పంటలు మేలు

బత్తలపల్లి: బెట్ట పరిస్థితులను తట్టుకునే పంటలు సాగు చేయడమే మేలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు తెలియజేశారు. శనివారం దంపెట్లలో వారు పర్యటించారు. కరువు, బెట్ట పరిస్థితులను తట్టుకునే పంటల సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు చేశారు. లీటరు నీటికి పొటాషియం నైట్రేట్‌(13–0–45) ఐదు గ్రాములు లేదా యూరియా లీటరు నీటికి 20 గ్రాములు లేదా 19–19–19(ఎన్‌.పి.కె) లీటరు నీటికి ఐదు గ్రాములు కలిపి పిచికారీ చేయాలన్నారు. పరిశోధన విభాగం సంచాలకులు డాక్టర్‌ వి.సుమతి, డీన్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌, కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బీవీ భాస్కర్‌రెడ్డి, పుట్టపర్తి డాట్‌ కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రామసుబ్బయ్య, డీఏఓ కృష్ణయ్య పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

తాడిమర్రి: సోదరుని ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొనేందుకు స్వగ్రామం వెళ్లిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఏకపాదంపల్లి గ్రామానికి చెందిన కూచి ఆది నరసింహులు(45), మునిలత దంపతులకు ఇద్దరు కూతుళ్లు నిత్య భార్గవి, రాజస్వి సంతానం. ధర్మవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసే ఆది నరసింహులు మకాంను అక్కడికే మార్చాడు. శనివారం ఏకపాదంపల్లిలో తన పెదనాన్న కుమారుడు కూచి నారాయణస్వామి కుమార్తె శ్వేత సీమంతం ఉండటంతో కూచి ఆది నరసింహులు కుటుంబంతో కలిసి గ్రామానికి వెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ అందరితో సంతోషంగా, సరదాగా గడిపాడు. భోజనాల అనంతరం సాయంత్రం 4.30 గంటల సమయంలో తన ఇంటి వద్దకు వెళ్లి మోటార్‌ ఆన్‌ చేసి మొక్కలను నీరు పెడుతున్నాడు. ఈ క్రమంలో పైపు జాయింట్‌ ఊడిపోగా, దాన్ని సరిచేస్తున్న క్రమంలో నీరు ఎగిసి మోటర్‌కు బిగించిన విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో విద్యుత్‌ ప్రసరణ జరిగి ఆది నరసింహులు కుప్ప కూలిపోయాడు. వెంటనే గమనించిన బంధుమిత్రులు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు గ్రామానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement