ముదిగుబ్బ: పరిహారం తేల్చకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా పొలాల్లో విద్యుత్ టవర్ల ఏర్పాటుకు విద్యుత్ అధికారులు సిద్ధం కాగా రైతులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. మండల పరిధిలోని మలకవేమల క్రాస్ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్‌కు వైకొత్తపల్లి సబ్ స్టేషన్ నుంచి 132 కేవీ లైన్ లాగేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం మలకవేమల, ఎనుములవారిపల్లి, సానేవారిపల్లికి చెందిన 15 మంది రైతుల పొలాల మీదుగా హైటెన్షన్ విద్యుత్ లైను వెళ్లనుండగా పలుచోట్ల పొలాల్లో విద్యుత్ టవర్లు నిర్మించాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. అయితే రైతుల అనుమతులు లేకుండానే శనివారం లక్ష్మీనారాయణమ్మ, రంగారెడ్డి, రామకృష్ణ పొలాల్లో మూడు హైటెన్షన్ టవర్ల నిర్మాణం కోసం విద్యుత్ శాఖ అధికారులు 150 మంది పోలీసులను మోహరింపజేసి పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని పనులు అడ్డుకున్నారు. పంటకు, భూమికి పరిహారం ఎంతనేది తేల్చకుండా టవర్ల నిర్మాణ పనులు చేయడం అన్యాయమన్నారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు పనులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె పొలంలో జేసీబీలతో టవర్ నిర్మాణం కోసం గుంతలు తీయగా.. మిగతా రైతులు బైఠాయించారు. పరిహారం తేల్చాకే పనులు చేసుకోవాలన్నారు. అంతవరకూ కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. బలవంతంగా పనులు చేపడితే ప్రాణత్యాగాలకు సిద్ధమని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పనులను అడ్డుకున్న రైతులు..
పరిహారం తేల్చాలని డిమాండ్


