సర్వేపల్లి కాలువ గట్టుపై పూరి గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని దశాబ్దాలుగా బతుకు జీవనం సాగిస్తున్నారు. వీరందరూ పాచి పనులు, దినసరి కూలీలు, ముఠా కూలీలుగా పని చేస్తేనే పూట గడవని పరిస్థితి. ఇలాంటి వారిని అక్కడ్నుంచి తరలించేందుకు గత టీడీపీ హయాంలోనే కుట్రలు చేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడం.. కాలువ ఆధునికీకరణ పనులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ హయాంలో చేపట్టి కొందరికి అక్కడే రిజిస్ట్రేషన్ పట్టాలను మంజూరు చేశారు. అయితే ఆధునికీకరణ పనులపై అప్పటి ప్రతిపక్షాలుగా ఉన్న కూటమి నేతలు కోర్టుకెళ్లడంతో కొంత మేర ఆగిపోయింది. అయితే మళ్లీ అధికారంలోకి రావడంతో మంత్రి నారాయణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిటీ నియోజకవర్గ పరిధిలోని గుర్రాలమడుగు సంఘం వారికే అక్కడ పట్టాలను మంజూరు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అదే కట్టపై రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే వెంకటరెడ్డి కాలనీ వాసులకు మాత్రం పట్టాలిచ్చే అంశంలో మంత్రి వివక్ష ప్రదర్శిస్తుండటంపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నారాయణ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రజల విషయంలో వివక్ష చూపుతు న్నారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీటేస్తున్నారు. తాను రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాననే అంశాన్ని విస్మరించి తన నియోజకవర్గానికే ప్రాధాన్యమిస్తున్నారు. సర్వేపల్లి కాలువకట్ట వేదికగా ఆయన సాగిస్తున్న రాజకీయాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. తన నియోజకవర్గ పరిధిలో ఉండే ఈ ప్రాంత వాసులకు పట్టాలిస్తూ.. రూరల్ పరిధిలోని ప్రాంతాన్ని విస్మరిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయమై అక్కడి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మౌనం దాలుస్తుండటం పలువురి ఆగ్రహానికి కారణమవుతోంది.
కొందరికే లబ్ధి చేకూరుస్తూ..
పెన్నా నుంచి ప్రారంభమయ్యే సర్వేపల్లి కాలువ నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తుంది. దీని పరిధిలోని 16వ డివిజన్లో గల గుర్రాలమడుగు సంఘం సిటీలో.. 19వ డివిజన్లోని సర్వేపల్లి కాలువకట్ట, వెంకటరెడ్డికాలనీ ప్రాంతాలు నెల్లూరు రూరల్ కిందికొస్తాయి. ఈ తరుణంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గుర్రాలమడుగు సంఘం ప్రాంతానికి చెందిన మొత్తం 1215 కుటుంబాలకు రిజిస్ట్రేషన్‌తో కూడిన శాశ్వత ఇళ్ల పట్టాలను కేటాయించి మంత్రి చేతుల మీదుగా త్వరలో పంపిణీ చేయనున్నారు.
తామేమి పాపం చేశాం
అమాత్యా..?
ఈ పరిణామాల క్రమంలో రూరల్ నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి కాలువకట్ట, వెంకటరెడ్డికాలనీ వాసులు తమ విషయంలో మంత్రి నారాయణ ఎందుకు వివక్ష చూపుతున్నారని.. తామేమి పాపం చేశామని ప్రశ్నిస్తున్నారు. అన్ని విధాలా అండగా ఉండి ఏ సమస్యొచ్చినా న్యాయం చేస్తామని తరచూ చెప్పే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సైతం ఈ విషయంలో ఏ మాత్రం చొరవ చూపకపోవడంపై స్థానికులు ఆక్రోశంతో రగిలిపోతున్నారు.
రాజకీయ విభేదాలతోనే..
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో నారాయణకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మున్సిపల్ శాఖ మంత్రిగా నెల్లూరు కార్పొరేషన్ పరిధి మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకొని పెత్తనం చెలాయించాలని నారాయణ పావులు కదపగా.. తన ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి రాజకీయంగా విభేదించారు. తన నియోజకవర్గ పరిధిలో మంత్రి వేలు పెట్టేందుకు వీల్లేదని కోటంరెడ్డి చెప్పారని, దీంతో అమాత్యుడు సైతం తనకెందుకని మిన్నకుండిపోతున్నారని సమాచారం. ఇద్దరు నేతల మధ్య రాజకీయ విభేదాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానికు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అగమ్యగోచరం
సర్వేపల్లి కాలువకట్ట, వెంకటరెడ్డి కాలనీ ప్రాంతాల్లో దాదాపు 700 కుటుంబాలు 70 ఏళ్లుగా అక్కడే నివాసమంటున్నాయి. వీరందరూ నిరుపేదలు. రోజు వారీ పనులు చేసుకుంటేనే కడుపులు నిండుతాయి. అలాంటిది ఎప్పటికై నా తమకు పట్టాలొస్తాయని ఆశతో నిరీక్షిస్తున్న వీరి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. అయితే ఇక్కడి వారికీ పట్టాలిస్తానని నారాయణ చెప్తుండగా, దానికి కోటంరెడ్డి ససేమిరా అంటూ అడ్డుపడుతున్నారనే ప్రచారం జరగుతుండటంతో ఎమ్మెల్యే వ్యవహారంపై స్థానికులు మండిపడుతున్నారు.
సర్వేపల్లి కాలువకట్ట నివాసితుల విషయంలో మంత్రి నారాయణ వివక్ష
సిటీ పరిధిలో ఉన్న 1215 కుటుంబాలకు అక్కడే పట్టాలు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ నిర్వాసితులకు ఇవ్వరా..?
70 ఏళ్లుగా ఇక్కడే 700 కుటుంబాల నివాసం
వీళ్లేం పాపం చేశారు మాస్టారూ..?
నోరెత్తని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
భగ్గుమంటున్న వెంకటరెడ్డికాలనీ వాసులు
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమంటూ మాటలు చెప్పే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. స్థానికులకు మేలు జరుగుతుంటే తన రాజకీయ ప్రయోజనాల కోసం మోకాలడ్డుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పుడు కాకపోతే.. మరోసారి తమకు అవకాశం రాకపోవచ్చని, ఇక ఎప్పటికీ ఉండదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి తన పరపతిని ఉయోగించి పేదలకు పట్టాలిప్పిస్తారా.. లేక వారి బతుకులపై దెబ్బకొడతారాననేది వేచి చూడాల్సి ఉంది. ఒక వేళ ఎమ్మెల్యే ప్రతిపాదనలు చేసినా.. మంత్రి నారాయణ అడ్డుపడే అవకాశాలూ లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


