పేదల సొమ్మును దుర్వినియోగం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

పేదల సొమ్మును దుర్వినియోగం చేయొద్దు

Sep 18 2026 11:58 PM | Updated on Sep 18 2026 11:58 PM

నెల్లూరురూరల్‌: పేద ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్మును దుర్వి నియోగం చేయడం సరికాదని నాయకులు అన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ పేరుతో రూ.1,200 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. దీనిపై మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఇప్పటికే పలు అంశాలకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచిందని తెలిపారు. ఆరోపణలపై సమాధానం చెప్పకుండా మంత్రి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఆయన తమతో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు.

సమాధానం చెప్పాలి

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మాట్లాడుతూ వీఆర్‌ హైస్కూల్‌ అభివృద్ధి పేరుతో రూ.10 కోట్ల అంచనాలు రూపొందించిన అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. ఒక్కో మొక్కకు రూ.12 వేల చొప్పున ఖర్చు చేయాలని ప్రతిపాదించిన అంశంపై సమాధానం చెప్పాలన్నారు. జాఫర్‌ సాహెబ్‌ కెనాల్‌ వద్ద స్ట్రీట్‌ వెండింగ్‌ ప్రాజెక్ట్‌ కోసం కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.8 కోట్లు డ్రా చేసిన అంశంపై వివరాలు వెల్లడించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లాప్‌ ఆటోలను పక్కనపెట్టి ట్రాక్టర్ల ద్వారా చెత్త తరలింపు చేపట్టడం వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. కాంపాక్టర్‌, స్వీపింగ్‌ మెషీన్ల అసలు ధరలు, వాటిని కొనుగోలు చేసిన ధరలు, టెండర్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. టెండర్లలో ఇతరులు పాల్గొనకుండా కొందరికే కాంట్రాక్ట్‌లు కట్టబెట్టారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేసిన అనంతరం యూజీడీ, ఇతర పనుల పేరుతో అదే రోడ్లను తవ్వడం ద్వారా ప్రజాధనం వృథా అవుతోందని విమర్శించారు. ఒకవైపు రోడ్లు నిర్మించి, మరోవైపు వాటిని పగలగొట్టడం ఎలా అభివృద్ధి అవుతుందని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇంటి పట్టాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న పట్టాలపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ పేరుతో జరుగుతున్న అవినీతికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క నెల్లూరు కార్పొరేషన్‌కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.ప్రజాధనం దుర్వినియోగంపై ప్రభుత్వం స్పందించకపోతే త్వరలో కార్పొరేషన్‌ కార్యాలయం, కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చెత్త నిర్వహణలో రూ.1,200 కోట్ల దోపిడీపై సమాధానం చెప్పాలి

మంత్రి నారాయణ బహిరంగ చర్చకు రావాలి: కాకాణి, పర్వతరెడ్డి

వీఆర్సీ సెంటర్‌లో

వైఎస్సార్‌సీపీ నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement