● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
ఇందుకూరుపేట: ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆయన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. కోవూరులో ఇటీవల నిర్వహించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయనతో సుదీర్ఘంగా పనిచేసిన సీనియర్ నాయకులను విస్మరించి విగ్రహావిష్కరణ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇప్పించేందుకు చంద్రబాబు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్టీఆర్ ఫొటో, పేరు గుర్తుకొస్తున్నాయని, మిగతా సమయంలో ఆయన ఆశయాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ లేదా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేస్తే గౌరవం దక్కేదన్నారు.
సీనియర్లను ఎందుకు పిలవలేదు?
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన తాళ్లపాక రమేష్‌రెడ్డి, అనురాధ వంటి పార్టీ సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా కాకుండా రాజకీయ బలప్రదర్శనగా నిర్వహించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు ఒక్కొక్కరికి రూ.300, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారని ఆరోపించారు. వైస్రాయ్ హోటల్ ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అప్పటి పరిణామాలు ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఎన్టీఆర్‌కు జరిగిన అవమానాలు, ఆయన ఎదుర్కొన్న మానసిక వేదనను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదని వ్యాఖ్యానించారు.
వ్యక్తిగత విమర్శలు వద్దు
మాజీ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్‌పై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను ప్రసన్న ఖండించారు. అనిల్ నెల్లూరులోనే అందుబాటులో ఉన్నారని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదన్నారు. అనవసరమైన సవాళ్లు విసరడం, వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చని, అయితే వ్యక్తిగత స్థాయిలో సవాళ్లు, ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్‌బాబు, మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, బుచ్చిరెడ్డిపాళెం రూరల్ కన్వీనర్ సతీష్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ షాహుల్ పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


