ఎస్‌ఈఐఎల్‌కు ప్రతిష్టాత్మక సీఐఐ అవార్డు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈఐఎల్‌కు ప్రతిష్టాత్మక సీఐఐ అవార్డు

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

ముత్తుకూరు (పొదలకూరు): ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ ప్రతిష్టాత్మక ఇంధన సామర్థ్య యూనిట్‌ అవార్డును అందుకున్నట్లు కంపెనీ సీఈఓ జన్మేజయ మహాపాత్ర శనివారం ఒక ప్రకనటలో తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సీఐఐ 27వ జాతీయ ఇంధన నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ అవార్డులు–2026లో తమ ప్రాజెక్ట్‌–1 ఇంధన సామర్థ్యం, నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ, సుస్థిర విద్యుత్‌ ఉత్పత్తిలో సమర్థతను ప్రదర్శించిందన్నారు. ఎస్‌ఈఐఎల్‌ తరఫున శ్రీనివాస్‌, హెడ్‌–ఓఎస్‌ అండ్‌ పీఎండీ రవీంద్ర జోషి, డీజీఎం తిరుమురుగన్‌, సీనియర్‌ మేనేజర్‌ అవార్డును అందుకున్నట్లు తెలిపారు.

సత్ప్రవర్తనతో మెలగాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ఏ నరసింహమూర్తి

వెంకటాచలం: ఖైదీలు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చాక సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఏ నరసింహమూర్తి సూచించారు. మండలంలోని చెముడుగుంటలో ఉన్న జిల్లా జైల్లో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముందుగా జైల్లో వంట శాలలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి భోజనం, కూరల నాణ్యతను పరిశీలించారు. ముద్దాయిల యోగ, క్షేమాలను అడిగి, జైల్లో వసతులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ తెలిసి, తెలియక చేసిన తప్పులు మళ్లీ, మళ్లీ చేయొద్దని జైలు నుంచి బయటకు వెళ్లాక తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో సంతోషంగా జీవించాలని సూచించారు. లాయర్‌ లేని వాళ్లకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా లీగల్‌ కౌన్సిల్‌ మెంబర్లను సంప్రదించాలని సూచించారు. జైల్లో పారా లీగల్‌ వలంటీర్‌ను నియమించడం జరిగిందని, వారి ద్వారా మీకు ఏ అవసరం ఉన్నా అర్జీల రూపంలో ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి వైజే పద్మశ్రీ, జైలు అడిషనల్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, జైలర్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

పొగాకు వేలం ముగింపు

125 రోజుల్లో

రూ.125.95 కోట్ల వ్యాపారం

సగటు ధర రూ.204.49

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 125 రోజులుగా కొనసాగిన పొగాకు వేలం ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ సీజన్‌లో మొత్తం 56,937 బేళ్లు వేలానికి రాగా, 45,727 బేళ్లను మాత్రమే కంపెనీలు కొనుగోలు చేశాయి. మొత్తం 19 కంపెనీలు కొనుగోళ్లలో పాల్గొనగా 6.15 మిలియన్‌ కిలోల పొగాకుకు రూ.125.95 కోట్ల మేర వ్యాపారం జరిగింది. వేలం ప్రారంభమైన తొలి రోజు నుంచి చివరి రోజు వరకు గరిష్టంగా రూ.250 ధర పలికింది. కనిష్ట ధర రూ.110గా నమోదు కాగా, సగటు ధర రూ.204.49గా నమోదైంది.

10,466 బేళ్లు విక్రయాలకు దూరం

వేలం కేంద్రానికి వచ్చిన బేళ్లలో గణనీయమైన సంఖ్యలో విక్రయాలు జరగకపోవడం రైతులను ఆందోళనకు గురి చేసింది. మొత్తం 7,873 బేళ్లకు నోబిడ్‌ నమోదైంది. మరో 56 బేళ్లు నోసేల్‌ అయ్యాయి. నాణ్యత, ఇతర కారణాలతో కంపెనీలు 1,741 బేళ్లను తిరస్కరించాయి. 796 బేళ్లను రైతులే వెనక్కి తీసుకెళ్లారు. మొత్తంగా 10,466 బేళ్లు విక్రయ ప్రక్రియ నుంచి బయటకు వెళ్లాయి. అదనంగా 744 బేళ్లు జంపింగ్‌ కేటగిరీలో నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement