● జిల్లా వ్యవసాయశాఖ
అధికారిణి పి.సత్యవాణి
నెల్లూరు (వేదాయపాళెం): జిల్లాలోని 36 మండలాల్లో 31 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి పి.సత్యవాణి తెలిపారు. స్థానిక ఏఆర్‌ఎస్ సమావేశ మందిరంలో శనివారం వ్యవసాయ అనుబంధ విభాగాలతో నెల వారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 12 మండలాల్లో అత్యధిక కరువు నెలకొందని, మరో 19 మండలాల్లో మధ్యస్థ స్థాయి కరవు ఏర్పడినట్లు పేర్కొన్నారు. కరువు తీవ్రత దృష్ట్యా రైతులు తొందరపడి రబీ పంటలు వేయొద్దని సూచించారు. తగిన వర్షపాతం, భూమిలో తేమ, సాగునీటి లభ్యతను పరిశీలించిన తర్వాత మాత్రమే పంటల సాగు గురించి నిర్ణయం తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఖరీఫ్ పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పంట నష్టం, వాతావరణ సమస్యలు గుర్తించిన ఉన్నతాధికారులకు నివేదించాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి లభ్యతను బట్టి మాత్రమే రబీ పంటలు ఎంపిక చేసుకోవాలని తెలిపారు. తగిన వర్షపాతం, నేలలో తేమ వచ్చే వరకు పంటల సాగులో రైతులు తొందర పడకుండా తగిన సూచనలు అందించాలన్నారు. కిసాన్ మహిళా దివస్ సందర్భంగా మహిళా రైతులకు ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కృషి విజ్ఞాన కేంద్రం, పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సమన్వయంతో రైతులకు సాంకేతిక సూచనలు, సహాయం అందించాలని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆత్మ డిప్యూటీ పీడీ ఉషారాణి, డీఆర్‌సీ డీడీ వి.సుమలత, ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు. వినీత, పొదలకూరు ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ సురేఖ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ హరి సాధు, డాక్టర్ కిరణ్, మార్క్‌ఫెడ్ డీపీఎం పవన్, చంద్రశేఖర్ ప్రణవ తదితరులు పాల్గొన్నారు.


