● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
విడవలూరు: తానెవర్నీ మోసం చేయలేదని.. వంచనకు గురయ్యానని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. తన కుటుంబంపై వేలెత్తి చూపే అర్హత వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి లేదని స్పష్టం చేశారు. వేలాది ఎకరాల ఆస్తులను పేదలకు ఉచితంగా రాసిచ్చిన కుటుంబం నుంచి వచ్చానని.. మీలా లాటరీలు, జాక్‌పాట్లతో రూ.కోట్లు సంపాదించిన అహంకారం తమకు లేదని చెప్పారు. ఓ వ్యక్తి మాటలు నమ్మి రూ.84.70 లక్షల మేర మోసపోయానని తెలిపారు. నమ్మించిన వ్యక్తి ఫోన్ ఎత్తకుండా పరారయ్యారని.. ఖాతాను సైబర్ క్రైమ్ అధికారులు ఫ్రీజ్ చేయగా, రూ.రెండు లక్షలే రికవరీ అయ్యాయని వెల్లడించారు. అయితే ప్రశాంతిరెడ్డి దీన్నేదో పెద్ద కుంభకోణంలా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ డబ్బు తనది కాదని.. పది మంది దగ్గర చెక్కులిచ్చి ట్రేడింగ్‌లో పెట్టినవేనని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భార్యలు, డాక్టర్లు సైతం ఇలా మోసాల్లో చిక్కుకున్నారని, తానూ ఇలానే మోసపోయానన్నారు. డబ్బు ఈ రోజు ఉంటుందని, రేపు పోవచ్చొని.. మాటకు కట్టుబడి ఉండే నిజాయతీ మాత్రమే శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. ఏ విచారణనైనా జరిపించుకోవాలని, తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.


