● కాకాణి, పర్వతరెడ్డి
నెల్లూరు రూరల్: ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని.. వీరిని గుండెల్లో పెట్టుకుంటామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నేతలతో శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో వారు మాట్లాడారు. రానున్న నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లింలందరూ ఐకమత్యంగా నిలిచి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని డివిజన్లలో విజయం సాధించేలా సలహాలు, సూచనలతో కార్యాచరణను రూపొందించనున్నామని ప్రకటించారు.
ఘనత జగన్‌దే..
నెల్లూరు కార్పొరేషన్లో మేయర్ పదవిని ముస్లింలకు కేటాయించిన ఘనత తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ముస్లిం మైనార్టీ అభ్యర్థిని నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించిన అంశాన్ని గుర్తుచేశారు. నాలుగు శాతం రిజర్వేషన్లను దివంగత సీఎం వైఎస్సార్ కల్పించగా.. మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి చొరవ చూపారని చెప్పారు.
టీడీపీది మొసలి కన్నీరు
ముస్లింల సంక్షేమ విషయంలో టీడీపీ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. మైనార్టీల ఆస్తులు, వక్ఫ్ భూములను రక్షించే విషయంలో తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లతో పాటు మేయర్ స్థానాన్ని తమ పార్టీ దక్కించుకునేలా మైనార్టీలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.


