పేలిన గ్యాస్‌ సిలిండర్‌ | - | Sakshi
Sakshi News home page

పేలిన గ్యాస్‌ సిలిండర్‌

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

ఆత్మకూరు రూరల్‌: పట్టణంలోని జేఆర్‌పేటలో గ్యాస్‌ లీకై సిలిండర్‌ పేలిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘటనలో ఫ్లాట్‌లోని కిటికీ అద్దాలు పగిలి రోడ్డుపై పడ్డాయి. భారీ శబ్దంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇంట్లోకి కొందరెళ్లి గ్యాస్‌ సరఫరాను నిలిపేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

చంపుతానని బెదిరించి.. నగదు దోపిడీ

నెల్లూరు(క్రైమ్‌): మద్యానికి డబ్బులివ్వాలని వ్యక్తిని బెదిరించి.. నగదును దోచుకున్న ఘటనలో రౌడీషీటర్‌పై కేసును పోలీసులు నమోదు చేశారు. వివరాలు.. ఇస్కాన్‌ సిటీలో నివాసముంటున్న నరసింహప్రసాద్‌.. బుజబుజనెల్లూరు నుంచి బైక్‌పై ఇంటికి శుక్రవారం రాత్రి బయల్దేరారు. ఎన్‌హెచ్‌ బిల్డింగ్‌ జంక్షన్‌ వద్దకొచ్చేసరికి రౌడీషీటర్‌ సూర్య అడ్డుకున్నారు. మద్యానికి డబ్బులివ్వాలని కోరగా, ఎందుకివ్వాలని నరసింహప్రసాద్‌ ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన సూర్య తననే ప్రశ్నిస్తావా.. డబ్బులివ్వకపోతే చంపుతానంటూ కత్తితో బెదిరించి రూ.వెయ్యిని దోచుకున్నారు. ఇంతలో ప్రసాద్‌కు తెలిసిన దినేష్‌, నరసింహరావు బైక్‌పై అక్కడికొచ్చి ఏమి జరుగుతోందని ప్రశ్నించగా, వారిని సైతం బెదిరించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసును వేదాయపాళెం పోలీసులు శనివారం నమోదు చేశారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

నెల్లూరు(క్రైమ్‌): గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వెంకటేశ్వరపురంలోని ఫ్లయ్‌ఓవర్‌ కింద మూడో లైన్‌ రైల్వే ట్రాక్‌ పక్కన శనివారం చోటుచేసుకుంది. సుమారు 55 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు కలిగి.. బ్లూ రంగు ఫుల్‌ హ్యాండ్స్‌ చొక్కా, బ్లూ గళ్ల లుంగీని ధరించి ఉన్నారు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై హరిచందన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనారోగ్యంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి.. కేసును ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 92475 75628 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

మద్యం మత్తులో

రోడ్డుపై పడి..

సీతారామపురం: మద్యం మత్తులో రోడ్డుపై పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని చిన్నాగంపల్లి సమీపంలో గల 167బీ జాతీయ రహదారిపై శనివారం వేకువజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ముత్తోలినగర్‌కు చెందిన సల్లగళ్ల ఆంథోనీ (53) చిన్నాగంపల్లిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని తిరిగి స్వగ్రామానికి నడుచుకొని బయల్దేరారు. మద్యం మత్తులో ఉన్న ఆయన మార్గమధ్యలో రహదారిపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పరిసర ప్రాంతాల్లో జనసంచారంతో పాటు వాహన రాకపోకలు పెద్దగా లేకపోవడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. తెల్లారేసరికి రహదారిపై వెళ్తున్న స్థానికులు.. రక్తగాయాలతో పడున్న ఆంథోనీని గుర్తించగా, అప్పటికే మృతి చెంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పొదలకూరు

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి: రూ.160

సన్నవి: రూ.110

పండ్లు: రూ.50

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement