నెల్లూరు(క్రైమ్): జిల్లా వ్యాప్తంగా ఆదివారం అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లు, కేడీలు, డీసీలకు పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద ఘటనలు, అల్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112, పోలీసు కంట్రోల్‌రూమ్ వాట్సప్ నంబర్ 9392903413కు సమాచారం అందించాలని పోలీసు అఽధికారులు కోరారు.
ఏం కష్టమొచ్చిందో..
● రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ చైన్నె వైపు వెళ్లే పట్టాలపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి వయసు 50 నుంచి 55 ఏళ్ల లోపు ఉంటుందని భావిస్తున్నారు. పింక్ అండ్ వైట్ చెక్స్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, గ్రే కలర్ నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఎడమ చేతిపై కృష్ణయ్య అనే పచ్చబొట్టు ఉంది. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు, 92475 75628 నంబర్‌కు తెలియజేయాలని ఆమె కోరారు.
పొలం పనులకు వెళ్లి..
● విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
ఇందుకూరుపేట: పొలంలో పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన మండలంలోని గంగపట్నంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గంగపట్నం గ్రామానికి చెందిన తుపాకుల దయాకర్ (45) వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలను తీసుకుని పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో పొలం సమీపంలో విద్యుత్ వైరు అడ్డుగా ఉండటంతో దానిని పక్కకు జరిపేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే దయాకర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. సమాచారం అందుకున్న ఇందుకూరుపేట ఎస్సై నవీన్ కుమార్ కేసు నమోదు చేశారు.
మద్యం తాగుతూ
కాలువలో పడి..
● వ్యక్తి మృతి
విడవలూరు: ఓ వ్యక్తి వంతెనపై కూర్చొని మద్యం తాగుతూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని తుమ్మగుంట సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య (32) మండలంలోని పటేల్ నగర్ గ్రామానికి చెందిన అంకమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. శనివారం తన భార్యాపిల్లలతో కలిసి పటేల్ నగర్‌లోని తన అత్తమామల ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం తుమ్మగుంట వద్ద గల పంట కాలువ వంతెనపై కూర్చొని మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని వెంటనే బయటకు తీసేందుకు తీశారు. అప్పటికే లక్ష్మయ్య మృతిచెందాడు. సమాచారం అందుకున్న సీఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్యం మత్తువల్లే ఈ ఘటన జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ తెలిపారు.


