డాక్టర్ల నిర్లక్ష్యం..గాల్లో కలిసిన ప్రాణం | - | Sakshi
Sakshi News home page

డాక్టర్ల నిర్లక్ష్యం..గాల్లో కలిసిన ప్రాణం

Aug 4 2026 12:17 AM | Updated on Aug 4 2026 12:17 AM

నెల్లూరు(అర్బన్‌): డాక్టర్ల నిర్లక్ష్యం.. అందని అత్యవసరమైన వైద్యం.. అందుబాటులో లేని డ్యూటీ డాక్టర్లు.. అరకొర వైద్యం అందించిన శిక్షణలో ఉన్న పీజీ డాక్టర్లు.. దీంతో అభంశుభం తెలియని ఓ బాలిక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో (పెద్దాస్పత్రి) చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు బలి తీసుకుందంటూ బాలిక కుటుంబ సభ్యులతోపాటు బంధువులు ఆదివారం అర్ధరాత్రి దాటే వరకూ ఆందోళన చేపట్టారు.

ఏం జరిగిందంటే..

ఊటుకూరు ప్రాంతానికి చెందిన హిమతేజ (16) బతుకుదెరువు నిమిత్తం అయ్యప్పగుడి సమీపంలోని దండోరా కాలనీలో ఉంటోంది. తల్లిదండ్రులు మత్స్యకారులు. వీరిది నిరుపేద కుటుంబం. బాలికకు శుక్రవారం వాంతులవుతుంటే నగరంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఇంజెక్షన్లు వేయడంతో వాంతులు తగ్గిపోయాయి. బాలిక నీరసంగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆదివారం ఉదయం పెద్దాస్పత్రికి వైద్యం కోసం క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు లేరు. శిక్షణలో ఉన్న పీజీ వైద్యులు స్కానింగ్‌ చేయించి అంతా బాగుంది. ఇబ్బంది లేదని చెప్పి సైలెన్‌ పెట్టారు. సాయంత్రం 5 గంటల తర్వాత రక్తపరీక్షల కోసం బ్లడ్‌ శాంపిల్‌ తీశారు. అప్పటి వరకు పట్టించుకోలేదు. కనీసం క్యాజువాలిటీ నుంచి వార్డుకు కూడా తరలించలేదు. అయితే ఏమి జరిగిందో గానీ రాత్రి 8 నుంచి 8:30 గంటల మధ్యలో బాలిక చనిపోయింది.

ఆస్పత్రి వద్ద బైఠాయింపు

బాలిక మరణించిన విషయాన్ని కూడా తల్లిదండ్రులకు డాక్టర్లు తెలపలేదు. హిమతేజ నుంచి స్పందన లేకపోవడంతో బాధిత కుటుంబం నిలదీసింది. ఆ తర్వాత రక్తపరీక్షల రిపోర్టులు వచ్చాయి. అప్పుడు డాక్టర్లు బాలికకు కామెర్లు ఉన్నాయి. లివర్‌ చెడిపోయిందని దీంతో చనిపోయిందని చెప్పారు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న తమ బిడ్డ ఎలా మరణించింది. అంతా బాగుందని ఎందుకు చెప్పారు. సీరియస్‌ అయితే ముందుగా చెబితే తాము ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లేవారం కదా అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. హిమతేజకు ఏం వైద్యం చేశారో రాసివ్వాలని ధర్నా చేపట్టారు.

వారు లేరు

బాలిక మృతి విషయంలో డాక్టర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం, సెలవు దినాలు అయితే డ్యూటీ డాక్టర్లు, హెచ్‌ఓడీలు అందుబాటులో ఉండరు. నర్సులు, శిక్షణలో ఉన్న డాక్టర్లే వైద్యం చేయాల్సి వస్తోంది. సాధారణంగా క్యాజువాలిటీకి రోగిని తీసుకొస్తే గంట లేదా రెండు గంటలు మాత్రమే ఉంచి ప్రాథమికంగా వైద్యం చేసి తర్వాత వార్డులోకి మార్చాలి. సీరియస్‌ అయితే ఐసీయూకి తరలించారు. ఇంకా సీరియస్‌ అయి శ్వాస తీసుకోలేకపోతే ఆక్సిజన్‌ అందించాలి. అవసరమైతే ఇన్‌ట్యుబేట్‌ చేసి వెంటిలేటర్‌ను అమర్చాలి. ఆ బాలికకు ఇలాంటి ఎమర్జెన్సీ వైద్యం అందలేదు. పీజీల వైద్యం దిక్కవడంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని మరికొంత మంది వైద్యులే పేర్కొంటున్నారు.

కేస్‌షీట్‌ ఎవరు రాయాలి?

బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డకు జరిగిన వైద్యం గురించి రాసివ్వాలని పట్టుబట్టారు. ఎక్కడ పేషెంట్‌ అడ్మిషన్‌లో ఉంటే అక్కడి డాక్టర్లు మాత్రమే ఎలాంటి వైద్యం చేశారో కేస్‌షీట్‌లో రాయాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగినట్టు ఆరోపణలున్నాయి. రోగికి క్యాజువాలిటీలో వైద్యం జరిగినప్పటికీ ఎంఐసీయూ విభాగం వారు కేస్‌షీట్‌ నమోదు చేశారని ప్రచారం ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన బంధువులు మరింత ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల రంగ ప్రవేశం

బాధిత బంధువులు తమకు న్యాయం చేయాలని క్యాజువాలిటీ బయట బైఠాయించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఆందోళన చేశారు. దీంతో నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై, ఐదో పట్టణ స్టేషన్‌ సీఐ వచ్చి సర్దిచెప్పారు. అయినా వారు ఆందోళన విరమించ లేదు. దీంతో పోలీస్‌ అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, నివేదికలో అంతా తెలుస్తుందని చెప్పారు. అయితే బంధువులు పోస్టుమార్టం వద్దని చెప్పారు. కేసు పెట్టబోమని, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

స్పందించిన డీఎంఈ

ఈ విషయంపై డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) స్పందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి ఏమి జరిగిందో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇదే విషయమై మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ కూడా ఫోన్‌ చేసి వివరాలు ఆరా తీశారని తెలిసింది. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాధవి వైద్యులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సింగ్‌ స్టాఫ్‌కు సంబంధించి మొత్తం 8 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. బాలిక మృతికి కారణాలు తెలుపుతూ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

బాలికకు అందని

ఎమర్జెన్సీ వైద్యం

డ్యూటీ డాక్టర్ల డుమ్మా

అరకొర వైద్యం అందించిన

శిక్షణలో ఉన్న పీజీ డాక్టర్లు

తెల్లవారుజాము వరకు

నిరసనకు దిగిన బంధువులు

నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో దారుణం

స్పందించిన డీఎంఈ, మహిళా కమిషన్‌

8 మంది డాక్టర్లు, సిబ్బందికి

షోకాజ్‌ నోటీసులు

కలెక్టర్‌కు నివేదిక ఇస్తాం

ఆస్పత్రిలో ఆదివారం డ్యూటీ డాక్టర్లున్నారు. వైద్యం కూడా చేశారు. అయితే ఆ బాలికకు అంతకు ముందు నుంచే ఏదో సమస్య ఉంది. బయట వైద్యం చేయించుకుని తీసుకొచ్చారు. ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం ఏమి లేదు. ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయి ఉండొచ్చు. ఏమి జరిగిందో వివరణ ఇవ్వాలని డాక్టర్లకు, సిబ్బందికి షోకాజ్‌ నోటీసులిచ్చాం. వారి వివరణ తీసుకుని కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం.

– డాక్టర్‌ కొండేటి మాధవి,

సూపరింటెండెంట్‌, సర్వజన ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement