● ఉద్యోగాలను తండ్రీకొడుకులు
అమ్ముకున్నారు
● డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ
లోకేశ్ రాజీనామా చేయాల్సిందే
● లేదంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది
● కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి
ప్రతాప్‌కుమార్‌రెడ్డి
కావలి: డీఎస్సీ నియామకాల పేరుతో ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల ఆశలతో అడ్డగోలుగా వ్యాపారం చేశారని, ఉద్యోగాలను తండ్రీకొడుకులు అమ్ముకుని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని కూటమి ప్రభుత్వంపై కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విరుచుకుపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేస్తామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ అక్రమాలపై దశల వారీ పోరాటంలో భాగంగా సోమవారం స్థానిక ఆర్‌ఎస్‌ఆర్ కల్యాణ మండపంలో కావలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత మహిళా నేతలతో కలిసి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనికి మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అవకతవకలపై ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే సమాధానం చెప్పలేక మౌనం వహిస్తున్నారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో నచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టి దండుకోవాలనే ఉద్దేశంతో దొంగ జీఓలను జారీ చేశారని ఆరోపించారు. ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే తప్పులు సరిదిద్దుకోకుండా ప్రశ్నించిన వారిపైనే ఎదురుదాడికి దిగడం టీడీపీ నైజంగా మారిందని దుయ్యబట్టారు. ఒక వైపు ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు గగ్గోలు పెడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఎద్దేవా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని, రాజ్యాంగంపై ఏ మాత్రం విశ్వాసమున్నా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి చెల్లింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అంతా శూన్యంగానే కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, దగదర్తి కన్వీనర్ మహేష్‌నాయుడు, కావలి రూరల్ మండల అధ్యక్షుడు తిరుపతి, అల్లూరు మండల అధ్యక్షుడు బీద రమేష్, మాజీ ఏపీఎంసీ చైర్మన్ కొండూరు అనిల్, జిల్లా కార్యదర్శి గంధం ప్రస న్నాంజనేయులు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి, ద్రోణాదుల వెంకట్రావు, మాజీ ఎంపీపీ పర్రి మహేశ్వరి, కుందుర్తి శ్రీనివాసులు, పందిటి సుమలత, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


