మద్యం మత్తులో గొంతు కోసుకుని.. | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో గొంతు కోసుకుని..

Aug 4 2026 12:17 AM | Updated on Aug 4 2026 12:17 AM

గూడూరులో ఘటన

గూడూరు: నిత్యం రద్దీగా ఉండే పట్టణంలోని టవర్‌ క్లాక్‌ ప్రాంతంలో అందరూ చూస్తుండగా చిన్నపాటి కత్తితో ఓ వ్యక్తి గొంతు కోసుకున్న ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు.. ఉత్తర భారతదేశానికి చెందిన సుమారు 35 సంవత్సరాలకు పైగా వయసున్న వ్యక్తి టవర్‌ క్లాక్‌ ప్రాంతంలో తిరుగుతూ గట్టిగా అరవసాగాడు. కాసేపటికి తన జేబులో నుంచి కత్తి తీసి గొంతు, అలాగే పొట్టపై కోసుకున్నాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతడిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతను మద్యం సేవించి ఉన్నాడని సిబ్బంది చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఏదైనా పరిశ్రమలో పని చేసేందుకు వచ్చాడా?, రైలు దిగి వచ్చాడా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఒకటో పట్టణ సీఐ శేఖర్‌బాబు, మహిళా ఎస్సై శిరీష పరిశీలించి వివరాలను సేకరించారు.

థమ్సప్‌ ఏజెంట్‌ పేరుతో మోసం

కలిగిరి: థమ్సప్‌ ఏజెంట్‌ పేరుతో ఓ కూల్‌డ్రింక్‌ షాపు నిర్వాహకుడి నుంచి నగదు కాజేసిన ఘటన కలిగిరి పంచాయతీలోని జిరావారిపాళెంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కె.శ్రీనివాసులు కూల్‌డ్రింక్‌ షాపు ఉంది. ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి సంధ్య కూల్‌డ్రింక్‌ షాప్‌ నుంచి అంటూ ఫోన్‌ చేశాడు. నీకు థమ్సప్‌ కంపెనీ తరఫున ఫ్రిజ్‌ మంజూరైందని రూ.5 వేలు డిపాజిట్‌ చేస్తే సోమవారం మధ్యాహ్నం మీ షాపునకు మా ఏజెంట్లు ఫ్రిజ్‌, కూల్‌డ్రింక్స్‌ తెచ్చిస్తారని నమ్మబలికాడు. అలాగే డిపాజిట్‌ మొత్తం కంపెనీ తిరిగి చెల్లిస్తుందని చెప్పాడు. శ్రీనివాసులు నమ్మి ఫోన్‌పే ద్వారా రూ.5 వేలు పంపాడు. సదరు వ్యక్తి మళ్లీ ఫోన్‌ చేసి కంపెనీ బోర్డు ఏర్పాటు చేస్తామని రూ.600 పంపాలని అడిగాడు. దీంతో శ్రీనివాసులుకు అనుమానం వచ్చి తన డబ్బులు ఇచ్చేయాలని కోరాడు. నీ డబ్బులు కంపెనీకి వెళ్లిపోయాయి.. వాళ్లని అడుగు అంటూ ఆ వ్యక్తి ఫేక్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. అలాగే కలిగిరికి చెందిన రమేష్‌ అనే మరో వ్యక్తికి సోమవారం ఉదయం ఫోన్‌ రావడంతో అనుమానం వచ్చి పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఫోన్‌ నంబర్‌ లొకేషన్‌ ద్వారా అతడిని విజయవాడకు చెందిన వాడిగా గుర్తించారు.

కండలేరులో

25.11 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 25.11 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్‌ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement