కుమారుల నిర్దయపై వృద్ధుల ఆవేదన | - | Sakshi
Sakshi News home page

కుమారుల నిర్దయపై వృద్ధుల ఆవేదన

Aug 4 2026 12:17 AM | Updated on Aug 4 2026 12:17 AM

పోలీస్‌ అధికారుల దృష్టికి సమస్య

పోలీస్‌ కార్యాలయంలో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

మొత్తం 179 వినతుల అందజేత

నెల్లూరు(క్రైమ్‌): ‘నాకు ముగ్గురు కుమారులు. నేను, నా భార్య వృద్ధాప్యంలో ఉన్నాం. ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. కుమారులు మా బాగోగులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విచారించి న్యాయం చేయండి’ అని నవాబుపేట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు కోరాడు. నెల్లూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 179 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలోని వాటిని పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీస్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య, మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ కె.వేమారెడ్డి, మహిళా పోలీస్‌స్టేషన్‌, పీసీఆర్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, దశరథరామారావు, శ్రీనివాసరెడ్డి, పీజీఆర్‌ఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

తిరుపతికి చెందిన భానుప్రసాద్‌ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్లు ఇద్దరం కలిసి తిరిగాం. ఇప్పుడు వివాహం చేసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని సైదాపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి కోరారు.

ఆస్తుల కోసం బెదిరింపు

నేను ఎన్‌ఆర్‌ఐని. నా భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటోంది. వారిద్దరి నుంచి నాకు, నా పిల్లలకు ప్రాణహాని ఉంది. ఇప్పటికే నా నుంచి రూ.4 కోట్లు వాళ్ల అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నారు. అదనపు ఆస్తుల కోసం బెదిరిస్తున్నారు. విచారణ జరిపించాలని కావలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.

రూ.45 లక్షలు తీసుకుని మోసం

ఏఎస్‌పేట మండలానికి చెందిన ఓ వ్యక్తి పొలం అమ్ముతానని నా వద్ద రూ.45 లక్షలు తీసుకున్నాడు. పొలం అమ్మకుండా తన భార్య పేరుపై రిజిస్టర్‌ చేయించాడు. మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్‌పేట ప్రాంతానికి చెందిన వినతిపత్రం అందజేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement