● కోట గురుకులాన్ని
కొనసాగించాలని డిమాండ్
నెల్లూరు(అర్బన్): కూటమి ప్రభుత్వం మండల కేంద్రమైన కోటలో మూసేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను కొనసాగించాలంటూ ఇన్సాఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎఫ్) డిమాండ్ చేసింది. గురుకులాన్ని పునఃప్రారంభించాలని కోరుతూ మంగళవారం ఆ సంఘం నేతలు, పలువురు విద్యార్థులు నెల్లూరులోని కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ 600 మంది చదువుతున్న గురుకుల పాఠశాలను టీడీపీ ప్రభుత్వం మూసేయడం దారుణమన్నారు.
బలవంతంగా లాగేసి..
ధర్నా సందర్భంగా నేతలు, విద్యార్థులు ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌లోకి ప్రవేశించబోయారు. దీంతో పోలీసులు గేట్లు మూసేసి అడ్డుకున్నారు. పలువురు గేట్లు నెట్టుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు విద్యార్థులను బలవంతంగా లాగేసి వాహనాల్లో ఎక్కించేందుకు ప్రయత్నించడంతో వారు కొంతసేపు ప్రతిఘటించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొంతమంది విద్యార్థులు తమను పోలీసులు కొట్టారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పలువురు ఆందోళనకారులను చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, రాజా తదితరులు పాల్గొన్నారు.


