● బోర్లకు సరఫరా నిలిపివేత
● సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
దగదర్తి: మండలంలోని కావలి కాలువ ఆయకట్టు పరిధిలో పంటలు సాగు చేస్తున్న రైతులు వినియోగిస్తున్న బోర్లకు అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో అన్నదాతలు కన్నెర్ర చేశారు. మంగళవారం కాట్రాయపాడు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి అధికారులను నిలదీశారు.
ఏం జరిగిందంటే..
ధర్మవరం, లింగాలపాడు, కాట్రాయపాడు, చెన్నూ రు, సిద్ధారెడ్డిపాళెం, బోడగుడిపాడు గ్రామాల పరిధిలోని రైతులు కావలి కాలువ కింద విద్యుత్ మోటార్లు, బోర్ల సహాయంతో సుమారు 5 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట వెన్నుపొట్ట దశలో ఉంది. సోమవారం రాత్రి కావలి కాలువ పరిధిలో మూడు ఫేజ్‌ల విద్యుత్ సరఫరాను ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు నిలిపివేశారు. దీంతో పంటలకు సాగునీరు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆగ్రహించిన రైతులు కాట్రాయపాడు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
తీవ్ర నష్టం
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతోనే వరి సాగు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం పంట కీలకమైన వెన్నుపొట్ట దశలో ఉండగా విద్యుత్ నిలిపివేయడంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. కావలి కాలువ చరిత్రలో ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.
మీదే బాధ్యత
తమ పంటలు ఎండిపోతుంటే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహించిన రైతులు సబ్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను శాంతింపజేశారు. అనంతరం ఏఈ, ఏడీఈ సబ్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్సై మహేంద్ర సమక్షంలో రైతులతో మాట్లాడారు. కలెక్టర్, ఎస్‌ఈ ఆదేశాల మేరకే విద్యుత్ సరఫరా నిలిపివేశామని, దానిని పునరుద్ధరించే అధికారం తమ పరిధిలో లేదని తేల్చి చెప్పారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కాలువ మోటార్లతోపాటు బోర్లకు కూడా విద్యుత్ ఎందుకు నిలిపివేశారని అన్నదాతలు ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పంటకు నష్టం జరిగితే అధికారులు బాధ్యత వహించాలని, సాగునీరు అందే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు హెచ్చరించారు.


