నెల్లూరు: బీసీలను లక్ష్యంగా చేసుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జన్యాలను ప్రశ్నిస్తున్న బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. రెడ్‌బుక్ పాలనపై ప్రజలు తిరబడే రోజు వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. బీసీలే టార్గెట్.. ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్టులా? ఇదేనా రెడ్‌బుక్ పాలన? అంటూ ప్రశ్నించారు.
''చంద్రబాబూ బీసీలంటే.. ఎందుకీ కక్ష? ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, చింతాడ రవి, జోగి రమేష్ కుటుంబ సభ్యులపై నమోదైన కేసులు యాదృచ్ఛికం కావు. ప్రజల తరఫున బలంగా గొంతెత్తుతున్న బీసీ నాయకత్వాన్ని బలహీనపర్చడానికే జరుగుతున్న టార్గెట్ రాజకీయాలే. అధికారం ఉంది కదా అని వెనుకబడిన వర్గాలను వేధిస్తే వెన్నుపోటు పార్టీపై బీసీల తిరుగుబాటు తప్పదు.
బీసీ నాయకులను వేధించడం ఆపండి.. లేదంటే మీ బూడిద పార్టీని బీసీలు బూడిద చెయ్యడం ఖాయం.. ఖబడ్దార్. రెడ్‌బుక్ రాజకీయాలు శాశ్వతం కావు ప్రజాస్వామ్యమే శాశ్వతం. బీసీలపై కక్షసాధింపు పాలనకు ప్రజలే తగిన సమయంలో గట్టి సమాధానం చెబుతార''ని ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
చదవండి: కూటమి ప్రభుత్వంపై బొలిశెట్టి ఫైర్


