అశోక్ మృతి కేసులో సంచలన ట్విస్ట్..! | Shocking Twist In Ashok Death Case | Sakshi
Sakshi News home page

అశోక్ మృతి కేసులో సంచలన ట్విస్ట్..!

Aug 4 2026 11:33 AM | Updated on Aug 4 2026 11:42 AM

Shocking Twist In Ashok Death Case

అనంతపురం సెంట్రల్‌:  అనంతపురంలోని హిత హాస్పిటల్‌లో దబ్బర అశోక్‌ డెత్‌ కేసు మిస్టరీగా మారుతోంది. మృతికి కారకులైన వారిలో ఆస్పత్రి ముఖ్య వ్యక్తే కీలకమని తెలుస్తోంది. ఇతనికి ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు సమాచారం. ముఖ్య వ్యక్తి, మరొకరిని పోలీసులు శనివారమే అదుపులోకి తీసుకున్నారు. ఇంకొకరు పరారీలో ఉన్నారు. ముఖ్య వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న  ఐ ఫోన్‌లో నిర్ఘాంతపోయే వీడియోలు,  దృశ్యాలు పోలీసులకు కనిపించినట్లు తెలిసింది. 

రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కమీషన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్న తాడిమర్రి  మండలం రామాపురానికి చెందిన దబ్బర అశోక్‌ (30) గత శుక్రవారం రాత్రి మూడో అంతస్తులోని కిటికీలో నుంచి నగ్నంగా కిందకు దూకాడు. గాయపడిన తర్వాత లేచి వెళ్తుండగా మళ్లీ కొందరు అతన్ని ఆస్పత్రిలోకి తీసుకుపోయారు. 

చికిత్స పొందుతున్న వ్యక్తి శనివారం ఉదయం మృతి చెందాడు. మృతిపై అనుమానాలు ఉన్నాయని అశోక్‌ అక్క ఫిర్యాదు చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. హాస్పిటల్‌కు చెందిన ముఖ్య వ్యక్తి మరో ఇద్దరితో కలిసి అశోక్‌ను చిత్రహింసలు పెట్టడం..అతడు ప్రాణభయంతో కిందకు దూకి వెళ్తుంటే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని.. మళ్లీ పట్టుకొచ్చి ప్రాణం పోయేలా చేశారని ఆరోపణలు వచ్చాయి.  

చదవండి: హింసించి.. చంపేశారా..?!

తీగ లాగితే డొంక కదిలిందా? 
దబ్బర అశోక్‌ను ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్న సన్నివేశాలను నిందితుల్లో ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసినట్లు తెలిసింది. అయితే అశోక్‌ మృతి చెందడంతో.. సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ఆస్పత్రిలోని సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్‌లో డేటాను డిలీట్‌ చేసినట్లు సమాచారం. కీలక నిందితుడు వాడుతున్నది ఐఫోన్‌ కావడంతో సైబర్‌ క్రైం పోలీసులు దాన్ని తీసుకుని, కొంత డేటా రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అందులో దాడి దృశ్యాలే కాకుండా ఆస్పత్రి ముఖ్య వ్యక్తి మరో కోణం బయటపడినట్లు సమాచారం.  కొంతమంది మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఫోన్‌లో లభించినట్లు తెలిసింది. డాక్టర్‌ వృత్తిలో కొనసాగే మహిళకు సంబంధించిన అశ్లీల వీడియోలు దగ్గర పెట్టుకొని సదరు ముఖ్య వ్యక్తి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే నిజమైతే మొత్తం ఈ కేసు      సంచలనంగా మారనుందని పోలీసులు భావిస్తున్నారు.  

అతనిదే కీలక పాత్ర! 
హాస్పిటల్‌ ముఖ్య వ్యక్తే దబ్బర అశోక్‌ మృతి ఘటనలో ముఖ్య పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఓ మహిళకు అశోక్‌ వాట్సాప్‌లో మెసేజ్‌ పంపడంతోనే ఈ గొడవ జరిగినట్లుగా సమాచారం. అయితే సదరు మహిళకు.. హత్యలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తికి ఏం సంబంధమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య వ్యక్తికి అధికార టీడీపీలో పదవితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులతో పరిచయం, బంధుత్వం ఉండటంతో.. కేసు నుంచి ఎలాగైనా బయటపడేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement