సోమిరెడ్డీ.. సీబీఐ విచారణకు సిద్ధమా..? | - | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డీ.. సీబీఐ విచారణకు సిద్ధమా..?

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

నెల్లూరు రూరల్‌: అవినీతి, అక్రమాలు, బినామీ ఆస్తుల సంపాదనలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. నీతి, నిజాయతీకి బ్రాండ్‌ అని చెప్పుకొనే సోమిరెడ్డి బతుకు అందరికీ తెలుసునని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి గ్రావెల్‌, ఇసుక, బూడిద, క్వార్ట్‌జ్‌, భూ దందాలు, లేఅవుట్‌ సెటిల్‌మెంట్లు, మహిళా ఉద్యోగులకు వేధింపులు ఇలా అన్ని రాస్తే పుస్తకం సైతం సరిపోదని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసే ముందు ఆయన అవినీతి, ఆస్తులు, భూ వ్యవహారాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోర్టు ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణను సీబీఐ జరిపి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైన నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. నార్కో, పాలిగ్రాఫ్‌ పరీక్షల ఆధారంగా ఈ కేసుతో సంబంధంలేదనే విషయం తేలిందన్నారు.

నిజాయతీ నిరూపించుకో..!

సోమిరెడ్డికి ధైర్యముంటే ఆరోపణలపై సీబీఐ విచారణకు అంగీకరించాలని.. లేని పక్షంలో తనతో బహిరంగ చర్చకు తేదీ, సమయాన్ని నిర్ణయించాలని సవాల్‌ విసిరారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరి ఆస్తుల వివరాలను ప్రజల ముందుంచి చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు. బూడిద బల్కర్లు, గ్రావెల్‌, క్వార్ట్‌జ్‌ తవ్వకాలు, గోవధ, స్లాటర్‌ హౌస్‌లు, దేవాలయ, ఏపీఐఐసీ భూములు, బండేపల్లి కాలువ, లేఅవుట్‌ సెటిల్‌మెంట్లు, మహిళా ఉద్యోగులపై వేధింపులు, అక్రమ వసూళ్లతో నెలకు రూ.లక్షల్లో దోచుకుంటోంది నిజం కాదానని నిలదీశారు. మీ తండ్రి ఇచ్చిన ఆస్తి ఎంత.. ఈ రోజు నీ వద్ద ఉన్న ఆస్తెంతో బహిరంగ చర్చకు సిద్ధమానని సవాల్‌ విసిరారు. తాను కొనుగోలు చేసిన.. విక్రయించిన ఆస్తులను సేల్‌ డీడ్లతో సహా బయటపెడతానని.. అలాగే సోమిరెడ్డికి ధైర్యముంటే బెంగళూరులో కొన్న గ్రానైట్‌ ఆస్తులు, బినామీ పేర్లతో ఉన్న వాటి వివరాలను చూపాలని డిమాండ్‌ చేశారు. గతంలో మీ హయాంలో ఏపీఐఐసీ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు యత్నించింది నువ్వు కాదా.. పెద్దలే గద్దలు అని ఈనాడులో వార్తలు రావడం నిజం కాదానని ప్రశ్నించారు.

అభివృద్ధి నిరోధకుడు.. దోపిడీదారుడు

తాను మంత్రిగా ఉన్న సమయంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు స్థలాన్ని ఎంపిక చేసి ఎంపీ గురుమూర్తి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని, అయితే మీరు అధికారంలోకి వచ్చాక వద్దని చెప్పి దాన్ని కాజేయాలని చూసిన దానిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇడిమేపల్లి వద్ద డిస్టిలరీస్‌ వారికి ఊళ్లో ఉన్న స్థలాన్ని విక్రయిస్తే, దానిపై కేసులు పెట్టించి సంబంధం లేని స్థలాన్ని స్వయంగా రిజిస్టర్‌ చేసిన చరిత్ర నీదే కదానని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు క్రీడా మంత్రి పదవినివ్వగా, ఉచిత క్రికెట్‌ కిట్లను తెచ్చి రూ.వెయ్యికి విక్రయించిన దౌర్భాగ్యుడివని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ఇంటి వద్దే నకిలీ విత్తనాల దుకాణాన్ని పెట్టారని ఆరోపించారు. తోటపల్లిగూడూరు మండలంలో పనికి ఆహార పథకం కింద వచ్చిన బియ్యాన్ని అమ్ముకున్నారంటూ అప్పట్లో జమీన్‌రైతు పత్రికలో ఆ బస్తాల ఫొటోలతో సహా ఆధారాలు ప్రచురితమైన అంశాన్ని గుర్తుచేశారు. అల్లీపురంలో నీ బతుకేంటో, తన గ్రామంలో తన స్థాయేంటో ప్రజలకు తెలుసునన్నారు. మీ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను దశలవారీగా ప్రజల ముందుంచుతామని ప్రకటించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై నిష్పాక్షిక విచారణను జరిపించాలని, మీడియాపై బెదిరింపులు, అక్రమ వసూళ్లపై పోలీస్‌ శాఖ స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్వెల్‌ సమయంలో పిల్లలు బయటకెళ్తే దొంగతనంగా పుస్తకాలను తీసుకెళ్లి శనగలు, బెల్లానికి అమ్ముకున్న చరిత్ర నీదని.. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలనైనా కోర్టులో నిరూపించాలని సవాల్‌ చేశారు. సోమిరెడ్డి రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన వివరాలతో సోమిరెడ్డి కథలు పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంపిణీ చేస్తామని తెలిపారు.

నీ అవినీతి, అక్రమాలకు హద్దే లేదు

నాపై వచ్చిన ఆరోపణల్లో

సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది

బెంగళూరు కేంద్రంగా కొన్న బినామీ ఆస్తులు వెల్లడిస్తావా..?

నీదీ ఓ బతుకేనా.. సిగ్గుండాలి

ధ్వజమెత్తిన మాజీ మంత్రి

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement