● రైతుకు తీవ్ర గాయాలు
కలిగిరి: మండలంలోని కృష్ణారెడ్డిపాళెం గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌కు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఆ వాహనాన్ని నడుపుతున్న రైతు కూనం నరసారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నరసారెడ్డి రైతుల వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల పొలంలోని కంపచెట్లను తొలగించి, వాటిని ట్రాక్టర్‌తో నెట్టుకుంటూ పాడుబడ్డ బావిలోకి తోసి నిప్పంటించాడు. అనంతరం మిగిలిన కంపను బావివైపు నెడుతుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. నరసారెడ్డికి కూడా మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన అతను తీవ్ర గాయాలతో కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన నరసారెడ్డి బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేయగా వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కలిగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


