● అమలు కాని సూపర్‌సిక్స్
● గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తోటపల్లిగూడూరు(పొదలకూరు): టీడీపీ చేపట్టిన కార్యక్రమం రెండేళ్ల నమ్మకం కాదనీ.. రెండేళ్ల మోసమని, వాగ్దానాలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజల్లోకి ఎలా వెళ్తారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తోటపల్లిగూడూరు మండలంలోని మాచర్లవారిపాళెం, చింతోపు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గురువులకు వందనాలు సమర్పించి.. గురుపూర్ణిమ శుభాకాంక్షలను తెలియజేశారు. మాచర్లవారిపాళెంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గ్రామాల్లో అభివృద్ధి స్తంభించిందని ఆరోపించారు. సూపర్‌సిక్స్ హామీలకు విలువ లేకుండాపోయిందని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవను అరకొరగా అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పింఛన్లను కొత్తగా మంజూరు చేయకపోవడంతో పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు దీని కోసం నిరీక్షిస్తున్నారని చెప్పారు.
నమ్మకాన్ని కోల్పోయిన చంద్రబాబు
ఈ రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు కోల్పోయారని దుయ్యబట్టారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండేళ్ల నమ్మకం పేరుతో గ్రామాల్లో ఎమ్మెల్యేలు ముందుగానే పర్యటించి ప్రజల వద్ద తిట్లు తినాల్సిందిగా పురమాయించారని ఎద్దేవా చేశారు. సంక్షేమం, అభివృద్ధి లేకపోవడంతో అధికారులు, ఎమ్మెల్యేలు ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి స్పందన రావడంలేదన్నారు. దివ్యాంగులకు స్లాట్లిచ్చి స్థానిక ఎన్నికల్లోపు ఏదో రకంగా పింఛన్లను అందజేసి ఆ తర్వాత మళ్లీ ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణంతో 97 శాతం మంది సంతోషంగా ఉన్నారంటూ గూడూరులో చంద్రబాబు ప్రకటించారని.. ఇంటి నివేశన స్థలాలివ్వకుండా, గృహాలు కట్టించకుండా వీరెలా ఆనందంగా ఉంటారని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అన్యాయంపై నెల్లూరులో యువత భారీ ర్యాలీని జరిపి విజయవంతం చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలను తెలియజేశారు.
లోకేశ్ నైతిక బాధ్యత వహించాలి
డీఎస్సీ దగాపై లోకేశ్ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీకు సంబంధించి కేంద్ర మంత్రి రాజీనామా చేసిన విధానాన్ని ఈయనా పాటించాలని పేర్కొన్నారు. లోకేశ్ రిజైన్ చేయకపోతే ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. అధికారం ఉన్నా.. లేకపోయినా ప్రజల మధ్యే తమ పార్టీ ఉంటుందని తెలిపారు. చింతోపు మాజీ సర్పంచ్ లేబూరు మల్లికార్జున్‌కు మాతృవియోగం కలగడంతో కుటుంబసభ్యులను పరామర్శించారు. చిల్లకూరు సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


