పొగాకు రైతులకు పోలీస్‌ సంకెళ్లు | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులకు పోలీస్‌ సంకెళ్లు

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్న కర్షకుల ముందస్తు నిర్బంధాలు

అడ్డుకోవడమేనా సమస్యకు

పరిష్కారం..?

ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న నేతలు

మర్రిపాడు: గిట్టుబాటు ధర కోసం నెలలుగా వేడుకుంటున్నా, ప్రయోజనం లేకపోవడంతో చివరికి రోడ్డెక్కాలని నిర్ణయించుకున్న పొగాకు రైతులకు పోలీసులు అడ్డుకట్టేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో డీసీపల్లి పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం నిర్వహించాల్సిన నిరసనను ఖాకీలు అడ్డుకున్నారు. పలువురు రైతు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

ఉదయం నుంచే నిఘా

రాస్తారోకోలో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతో డీసీపల్లిలోని వేలం కేంద్రం వద్ద పోలీసులను ఆత్మకూరు సీఐ గంగాధర్‌, మర్రిపాడు, ఏఎస్‌పేట ఎస్సైలు బలరామ్‌రెడ్డి ఉదయం నుంచే మోహరించారు. కార్యక్రమంలో పాల్గొనొద్దంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు సంఘ నేత చండ్రా నారాయణస్వామితో పాటు పలువురు నేతల ఇళ్లకెళ్లి నోటీసులను అందజేశారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించారు.

స్పష్టమైన హామీ ఏదీ..?

గిట్టుబాటు ధర కోసం రెండు నెలలుగా వినతిపత్రాలిస్తూ.. ధర్నాలు, బైక్‌ ర్యాలీలు, అధికారులతో సమావేశాలను నిర్వహిస్తూ.. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నామని చండ్రా నారాయణస్వామి తెలిపారు. అయినా సర్కార్‌ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోకు పిలుపునిచ్చారని వివరించారు. ఈ క్రమంలో నేతలను నిర్బంధించడం బాధాకరమన్నారు. పొగాకు రైతులు నష్టపోకుండా కిలోకు రూ.300కుపైగా ధర లభించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కొనుగోళ్లను వేగవంతం చేసి రైతుల వద్ద నిల్వ ఉన్న మొత్తాన్నీ సేకరించాలని పేర్కొన్నారు.

ఆందోళనను అణిచేసే యత్నం

ఆందోళనను అణిచేయాలనే ఉద్దేశంతో జిల్లాలో రైతు సంఘ నేతలను గృహ నిర్బంధం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని సంఘ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి లక్కు ప్రసాద్‌, నేత లక్ష్మీపతి తదితరులను హౌస్‌ అరెస్ట్‌ చేయడాన్ని తప్పుబట్టింది. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే సర్కార్‌ ఇలా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement