టీడీపీ హయాంలోనే అక్రమ తవ్వకాలు | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలోనే అక్రమ తవ్వకాలు

Published Wed, Jul 12 2023 2:00 AM

- - Sakshi

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఓవైపు అసత్య ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ‘ఈనాడు’ తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విషం చిమ్ముతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్‌ తవ్వకాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించగా.. రోడ్ల అభివృద్ధిపై ‘ఈనాడు’ తప్పుడు కథనం ప్రచురించింది. వాస్తవాలను పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డే గ్రావెల్‌ మాఫియాను ప్రోత్సహించారని వెల్లండైంది. అలాగే గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ‘ఈనాడు’ తప్పుడు కథనం ప్రచురించిందని స్పష్టమైంది.

 నెల్లూరు: గత టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అండతో వెంకటాచలం మండలంలో గ్రావెల్‌ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోయింది. గ్రామాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. టీడీపీ నాయకులు తవ్వి న గ్రావెల్‌ గుంతలు వేసవిలో చిన్నారులను బలి తీసుకుంటున్నాయి. తాను చేసిన పాపాలను సోమిరెడ్డి ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై వేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ప్రజల ముందు నవ్వులపాలయ్యాడు. ఇలాంటి ఘటన తాజాగా వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామంలో వెలుగుచూసింది.

అడ్డూఅదుపూ లేకుండా..
గత ప్రభుత్వంలో వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్‌, కనుపూరు చెరువులతోపాటు గ్రామాల్లోని అన్ని చెరువుల్లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. దీనిపై అప్పట్లో రైతులు, గ్రామస్తులు పలు దఫాలు ఆందోళనలు చేసినా సోమిరెడ్డి అండతో గ్రావెల్‌ అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా నిర్వి రామంగా సాగింది. వర్షాకాలంలో చెరువుల్లో నిండుగా నీరు చేరడంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను సైతం వదలకుండా అక్రమంగా గ్రావెల్‌ తవ్వి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. టీడీపీ నాయకుల ధనదాహం కారణంగా గ్రామానికి అనుకుని ఉన్న చెరువులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాల్లో 10 నుంచి 20 అడుగుల లోతుకు పైగా టీడీపీ నాయకులు తవ్విన గ్రావెల్‌ గుంతలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

సోమిరెడ్డి ధనదాహానికి విద్యార్థుల బలి
2014 ఎన్నికల్లో ఓటమిపాలైన సోమిరెడ్డి దొడ్డిదారిన మంత్రి పదవి దక్కించుకుని అవినీతి, అక్రమ సంపాదనపై దృష్టి సారించారు. అందులో భాగంగానే వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రిజర్వాయర్‌, కసుమూరు, ఈదగాలి, తిక్కవరప్పాడు, కంటేపల్లి, కనుపూరు రిజర్వాయర్‌, సర్వేపల్లి గ్రామాల నుంచి రేయింబవళ్లు అక్రమంగా గ్రావెల్‌ తరలించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. సోమిరెడ్డి తవ్వించిన భారీ గ్రావెల్‌ గుంతలు గత నెలలో అనికేపల్లిలో ఒక విద్యార్థిని, మూడు రోజుల క్రితం గొలగమూడిలో మరొక విద్యార్థిని బలి తీసుకున్నాయి. అనికేపల్లి గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి తురకా వెంకయ్య తోటి విద్యార్థులతో కలిసి గ్రామానికి అనుకుని ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్‌ వద్దకు ఈతకు వెళ్లి గ్రావెల్‌ గుంతలో పడి మృతిచెందాడు.

ఇది సోమిరెడ్డి హయాంలో తవ్విన గ్రావెల్‌ గుంతే. కానీ ఈ మరకను సోమిరెడ్డి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నెట్టే కుట్ర చేసి విఫలమయ్యాడు. గొలగమూడిలో టీడీపీ నాయకులు చాకలి చెరువులో తవ్విన గ్రావెల్‌ గుంతలో పడి మూడు రోజుల క్రితం 2వ తరగతి విద్యార్థి హిమాయితుల్లా మృతిచెందడంతో తన పాపాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ఆ గ్రామానికి వెళ్లి వైఎస్సార్‌సీపీ నాయకులు తవ్విన గోతులని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు కొందరు అవి ఇప్పుడు తవ్విన గుంతలు కాదని, 2016–17లో తవ్వి న గుంతలని చెప్పడంతో అందరి ముందు నవ్వులపాలయ్యాడు. ఒకే పంచాయతీలోని అనికేపల్లి, గొలగమూడి గ్రామాల్లో సోమిరెడ్డి ధనదాహానికి ఇద్దరు చిన్నారులు బలయ్యారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోమిరెడ్డే కారణం

గొలగమూడి, అనికేపల్లి గ్రామాల్లో ఇద్దరు చిన్నారులు గ్రావెల్‌ గుంతల్లో పడి చనిపోవడానికి సోమిరెడ్డే కారణం. టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి అండతో గ్రావెల్‌ తవ్వకాలు అడ్డూఅదుపూ లేకుండా సాగాయి. అప్పట్లో తవ్విన గ్రావెల్‌ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన విషయం వాస్తవం. కానీ సోమిరెడ్డి దిగజారి ఆ పాపాన్ని వైఎస్సార్‌సీపీపై వేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.
– ఉడతా శ్రీనివాసులు, గొలగమూడి

గత టీడీపీ ప్రభుత్వంలో గొలగమూడి గ్రామంలో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. సోమిరెడ్డి అండతో నాగులవరం, గొలగమూడి గ్రామాల చుట్టూ గ్రావెల్‌ అక్రమంగా తరలించడంతో ఎక్కడ చూసినా భారీ గుంతలు ఏర్పడ్డాయి. సోమిరెడ్డి హయాంలో తవ్విన చాకలి చెరువు గుంతలో పడి హిమాయితుల్లా మృతిచెందితే దానిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడం సరికాదు.
– అన్నపరెడ్డి శీనయ్య, గొలగమూడి

Advertisement
Advertisement