సీన్‌ విలియమ్స్‌ సూపర్‌ సెంచరీ.. తప్పిన ఫాలో ఆన్‌ గండం | ZIM Vs SA 1st Test: South Africa Gain Control On Day 2 Despite Williams Ton, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

ZIM vs SA: ఫాలో ఆన్‌ గండం తప్పించుకున్న జింబాబ్వే.. క్రెడిట్‌ అతడికే!

Jun 30 2025 10:06 AM | Updated on Jun 30 2025 10:43 AM

ZIM vs SA 1st Test: South Africa Gain control on Day 2 despite Williams Ton

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు (ZIM vs SA 1st Test)లో జింబాబ్వే ఫాలో ఆన్‌ గండం తప్పించుకుంది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ సీన్‌ విలియమ్స్‌ (Sean Williams- 164 బంతుల్లో 137; 16 ఫోర్లు) సెంచరీ సాధించి ఈ మేరకు ఊరట కల్పించాడు. బులవాయో వేదికగా ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. 

కెప్టెన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ (90 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. బ్రియాన్‌ బెనెట్‌ (19), కిటానో (0), నిక్‌ వెల్చ్‌ (4), వెస్లీ మధెవెరె (15), ప్రిన్స్‌ (7), తఫద్జా ట్సిగా (9), మసకద్జా (4) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుసకట్టారు.

ముల్డర్‌కు నాలుగు వికెట్లు
ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్‌ ముల్డర్‌ 4 వికెట్లు పడగొట్టగా... కేశవ్‌ మహరాజ్, యూసుఫ్‌ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 49 పరుగులు చేసింది.

ఓపెనర్లలో మాథ్యూ బ్రీజ్కె (1) అవుట్‌ కాగా... టోనీ డి జోర్జి (22 బ్యాటింగ్‌; 2 ఫోర్లు).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ముల్డర్‌ (25 బ్యాటింగ్‌; 4 ఫోర్లు)తో కలిసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 418/9 వద్దే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. దీంతో ఓవరాల్‌గా చేతిలో 9 వికెట్లు ఉన్న సఫారీ జట్టు ప్రస్తుతం 216 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తద్వారా జింబాబ్వేతో తొలి టెస్టులో పట్టు బిగించింది.

కేశవ్‌ మహరాజ్‌@ 200
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న కేశవ్‌ మహరాజ్‌... అరుదైన ఘనత సాధించాడు. సఫారీ జట్టు తరఫున 200 టెస్టు వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జింబాబ్వే కెప్టెన్‌ ఇరి్వన్‌ను అవుట్‌ చేయడం ద్వారా కేశవ్‌ మహరాజ్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో 200వ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. 9 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 35 ఏళ్ల కేశవ్‌... ఇప్పటి వరకు 59 టెస్టుల్లో 202 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement