ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రికార్డు సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్‌ | ZIM VS SA 1st Test: Corbin Bosch Made Into Record Books By Scoring Century At No 8 | Sakshi
Sakshi News home page

ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రికార్డు సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్‌

Jun 29 2025 4:39 PM | Updated on Jun 29 2025 5:54 PM

ZIM VS SA 1st Test: Corbin Bosch Made Into Record Books By Scoring Century At No 8

బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఆటగాడు కార్బిన్‌ బాష్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేశాడు. తద్వారా ఆ దేశ దిగ్గజాల సరసన రికార్డు బుక్కుల్లో చోటు దక్కించుకున్నాడు. గతంలో మార్క్‌ బౌచర్‌ (122 నాటౌట్‌), డాల్టన్‌ (117), ముర్రే (109), డేవ్‌ రిచర్డ్‌సన్‌ (109), విన్‌స్లో (108), జేపీ డుమిని (100 నాటౌట్‌) సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి సెంచరీలు చేశారు.  

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో బాష్‌ తొలి ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బాష్‌కు ముందు అరంగేట్రం ఆటగాడు లూహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (153) కూడా సెంచరీతో కదంతొక్కాడు. మరో అరంగేట్రం ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌ (41 బంతుల్లో 51) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు.

ప్రిటోరియస్‌, బాష్‌ సెంచరీలతో సత్తా చాటడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్‌ 17, బెడింగ్హమ్‌ 0, వెర్రిన్‌ 10, కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌ 21, కోడి యూసఫ్‌ 27, మఫాకా 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్‌ తీశారు.

అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సీన్‌ విలియమ్సన్‌ (56), కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ (30) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 305 పరుగులు వెనుకపడి ఉంది. 

జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్‌ బెన్నెట్‌ 19 పరుగుల వద్ద రిటైర్డ్‌ హర్ట్‌ కాగా.. కైటానో 0, వెల్చ్‌ 4 పరుగులకు ఔటయ్యారు. అరంగేట్రం బౌలర్‌ కోడి యూసఫ్‌కు రెండు వికెట్లు ద​క్కాయి. కాగా, ఇటీవలే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌గా అవతరించిన సౌతాఫ్రికా తమ ద్వితియ శ్రేణి జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement