
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ వెటరన్ బ్యాటర్ టెస్ట్‌ల్లో 2000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 72 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 2000 పరుగుల మార్కును తాకాడు. 79 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.
ఇటీవలికాలంలో పేలవ ఫామ్‌లో ఉండిన కాన్వే.. ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌తోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 88 పరుగులు చేశాడు. 2021లో ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన కాన్వే.. తన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ బాదాడు. టెస్ట్ కెరీర్‌లో 29 మ్యాచ్‌లు ఆడిన కాన్వే 4 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. జింబాబ్వేను 125 పరుగులకు కుప్పకూల్చిన ఆ జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 174 పరుగులు చేసింది. కాన్వేతో (79) పాటు జేకబ్ డఫీ (8) క్రీజ్‌లో ఉన్నారు. విల్ యంగ్ 74 పరుగులు చేసి ఔటయ్యాడు.
అంతకుముందు మ్యాట్ హెన్రీ (15-3-40-5), జకరీ ఫోల్క్స్ (16-5-38-4) విజృంభించడంతో జింబాబ్వే 125 పరుగులకే చాపచుట్టేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మూడున్నరేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్ (44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ విన్సెంట్ మసేకెసా 33 పరుగులతో అజేయంగా నిలిచాడు.
రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ కొసం న్యూజిలాండ్ జింబాబ్వేలో పర్యటిస్తుంది.