
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరైన వ్యూహాలు అమలు చేయడంలో విఫలమయ్యాడని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ అన్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో బౌలర్ల సేవలు సరిగ్గా వినియోగించుకోలేకపోయాడంటూ పెదవి విరిచాడు. శుక్రవారం నాటి తొలి సెషన్‌లో స్పిన్నర్ల చేతికి బంతిని ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 1-2తో టీమిండియా వెనుకబడి ఉంది. మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో గెలిస్తేనే గిల్ సేనకు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే డ్రా కోసం టీమిండియా ప్రయత్నించడమే ఉత్తమంగా కనిపిస్తోంది.
358 పరుగులకు ఆలౌట్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 544 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ కంటే 186 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
టీమిండియా బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (113 బంతుల్లో 84), బెన్ డకెట్ (100 బంతుల్లో 94) మరోసారి ‘బజ్‌బాల్’ శైలిలో రెచ్చిపోయారు. మరోసారి జో రూట్ తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ రికార్డు శతకం (150)తో చెలరేగగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (77 నాటౌట్) కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆతిథ్య జట్టుకు ఈ మేర ఆధిక్యం లభించింది.
ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేస్‌లో పదును తగ్గగా.. మహ్మద్ సిరాజ్‌తో పాటు అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ ముగ్గురూ తలా ఒక వికెట్ దక్కించుకోగా.. ఇక శార్దూల్ ఠాకూర్ మరోసారి విఫలమయ్యాడు. అయితే, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.
గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు
ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ తీరుపై మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. ‘‘నేనే గనుక గిల్ స్థానంలో ఉండి ఉంటే.. స్పిన్నర్లతో రోజును ఆరంభించేవాడిని. కనీసం వారికి రెండు- మూడు ఓవర్లు వేసే అవకాశం ఇచ్చేవాడిని.
కానీ గిల్ అలా చేయలేదు. అందుకు కారణమేమిటో అతడే వివరించాలి. అతడు వ్యూహాత్మక తప్పిదాలు చేశాడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. ఇక దురదృష్టవశాత్తూ బుమ్రా కూడా ఈ పిచ్‌పై రాణించలేకపోయాడని.. సిరాజ్ మాత్రం ఫర్వాలేదనిపించాడన్నాడు.
అదే విధంగా.. గంటకు 78- 81 మైళ్ల వేగంతో బౌలింగ్ చేసే శార్దూల్ ఠాకూర్ నుంచి ఇక్కడ మెరుగైన ప్రదర్శన ఆశించడం కూడా తప్పేనని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇక అన్షుల్ కొత్త వాడని.. ఆదిలోనే అతడు అద్భుతాలు చేయలేడని పేర్కొన్నాడు. వీరందరితో నెగ్గుకురావడం కాస్త కష్టమేనంటూ ఒకానొక సందర్భంలో గిల్‌కు మద్దతు పలికాడు.
చదవండి: AUS vs WI: టిమ్ డేవిడ్ మెరుపు సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్