
వెస్టిండీస్ గడ్డపై ఆస్ట్రేలియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. శనివారం సెయింట్స్ కిట్స్ వేదికగా విండీస్‌తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా 5 టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్ మిగిలూండగానే 3-0 తేడాతో కంగారులు సొంతం చేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్(102) ఆజేయ శతకంతో కదం తొక్కగా.. బ్రాండెన్ కింగ్(62) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ ఓవెన్, ఎల్లీస్, జంపా తలా వికెట్ సాధించారు.
డేవిడ్ విధ్వంసకర శతకం..
అనంతరం 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.1 ఓవర్లలో చేధించింది. ఈ లక్ష్య చేధనలో ఆసీస్ ఆటగాడు టిమ్ డేవిడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఆజేయగా నిలిచాడు.
ఆస్ట్రేలియా తరపున టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా డేవిడ్ రికార్డులకెక్కాడు. డేవిడ్‌తో పాటు మిచెల్ ఓవెన్(36 నాటౌట్), మార్ష్(22), మాక్స్‌వెల్(20) రాణించారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్ ఓ వికెట్ సాధించారు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ఇదే వేదికలో జరగనుంది.
చదవండి: ప్లేయర్స్‌ను గంభీర్ నమ్మడం లేదు.. ఇలా అయితే చాలా కష్టం: మనోజ్ తివారీ