ప్లేయర్స్‌ను గంభీర్‌ న‌మ్మ‌డం లేదు.. ఇలా అయితే చాలా క‌ష్టం: మనోజ్‌ తివారీ | Manoj Tiwary feels Gautam Gambhirs approach isnt stable for Test cricket | Sakshi
Sakshi News home page

ప్లేయర్స్‌ను గంభీర్‌ న‌మ్మ‌డం లేదు.. ఇలా అయితే చాలా క‌ష్టం: మనోజ్‌ తివారీ

Jul 26 2025 11:43 AM | Updated on Jul 26 2025 12:12 PM

Manoj Tiwary feels Gautam Gambhirs approach isnt stable for Test cricket

టీమిండియా హెడ్ కోచ్‌గా వైట్‌బాల్ క్రికెట్‌లో విజయవంతమైన గౌతమ్ గం‍భీర్‌.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు తన మార్క్‌ను చూపించలేకపోయాడు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి.. ఇప్పుడు అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 1-2 తేడాతో భారత్ వెనుకబడి ఉండటంతో గంభీర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. 

తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేరాడు. గంభీర్ ఎక్కువగా ఆల్‌రౌండర్లపై ఆధారపడుతున్నాడని, స్పెషలిస్టులను నమ్మడం లేదని తివారీ అన్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడించకపోవడంతో మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్‌లోమ‌నోజ్ తివారీ, గంభీర్ క‌లిసి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.

"ఒక టెస్టు మ్యాచ్‌ ఆడేట‌ప్పుడు జ‌ట్టులో క‌చ్చితంగా స్పెష‌లిస్ట్‌లు ఉండాలి. ఈ విష‌యం ఇప్ప‌టికే చాలా సార్లు నేను చెప్పాను. కానీ టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం స్పెషలిస్టు స్పిన్న‌ర్లు, ఫాస్ట్ బౌల‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి ఆల్‌రౌండ‌ర్ల‌పై ఎక్కువ‌గా న‌మ్ముతున్నారు. గంభీర్ హెడ్ కోచ్‌గా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఓ కొత్త అన‌వాయితీని తీసుకొచ్చాడు.

ఏ ప్లేయ‌ర్ అయినా ఒకట్రెండు మ్యాచ్‌లు విఫ‌ల‌మైతే అత‌డి స్దానంలో వేరే ఆట‌గాడిని భ‌ర్తీ చేస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో అశ్విన్‌పై వేటు వేసి వాషింగ్ట‌న్ సుందర్‌కు గంభీర్ అవ‌కాశ‌మిచ్చాడు. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో దేవదత్ పడిక్కల్, హ‌ర్షిత్ రాణాలు భార‌త జ‌ట్టు త‌ర‌పున ఆడారు. కానీ ఇప్పుడు వారిద్ద‌రూ జ‌ట్టులో లేరు. ఇప్పుడు కొత్త‌గా అన్షుల్ కాంబోజ్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

అంటే గంభీర్ రాడార్‌లో ఇక హ‌ర్షిత్ రాణా లేన‌ట్లే. గంభీర్‌కు స్థిరత్వం లేదు. అత‌డు తన ఆటగాళ్లను ఎక్కువ కాలం నమ్మలేకపోతున్నాడు. పార్ట్ టైమ్ ఆల్ రౌండర్లను ఆడించి టెస్టు మ్యాచ్‌ను గెల‌వాల‌నుకుంటున్నాడు. అది ఎప్ప‌టికి సాధ్యం కాదు అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: ఏయ్.. అక్క‌డేమి చేస్తున్నావ్‌? యువ ఆట‌గాడిపై జ‌డేజా ఫైర్‌! వీడియో వైర‌ల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement