
పాకిస్తాన్‌దే టీ20 సిరీస్
వెస్టిండీస్‌కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. గత టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతి (WI vs AUS)లో చిత్తుగా ఓడిన విండీస్.. తాజాగా పాకిస్తాన్‌కు కూడా పొట్టి సిరీస్ (WI vs PAK T20Is)ను సమర్పించుకుంది. ఫ్లోరిడా వేదికగా సోమవారం నాటి మూడో టీ20లో ఓడిపోయి.. 1-2తో పరాజయాన్ని చవిచూసింది.
రాణించిన ఓపెనర్లు
కాగా వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్వదేశంలో పాకిస్తాన్‌తో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. మొదటి మ్యాచ్‌లో పాక్, రెండో మ్యాచ్‌లో విండీస్ గెలిచాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిర్ణయాత్మక మూడో టీ20లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.
ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (53 బంతుల్లో 74), సయీమ్ ఆయుబ్ (66) అర్ధ శతకాలతో రాణించి శుభారంభం అందించారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ హసన్ నవాజ్ (15), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారీస్ (2) మాత్రం విఫలమయ్యారు.
ఆఖర్లో ఖుష్ దిల్ (6 బంతుల్లో 11) కాస్త వేగంగా ఆడగా.. ఫాహీమ్ అష్రాఫ్ (3 బంతుల్లో 10) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 189 పరుగులు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసెఫ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అథనాజ్, రూథర్‌ఫర్డ్ మెరుపులు వృథా
ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ జెవెల్ ఆండ్రూ (15 బంతుల్లో 24) రాణించాడు. కానీ వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాయీ హోప్ (7) నిరాశపరచగా.. రోస్టన్ ఛేజ్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలో మరో ఓపెనర్ అలిక్ అథనాజ్, నాలుగో నంబర్ బ్యాటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అథనాజ్ 40 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు చేయగా.. రూథర్‌ఫర్డ్ 35 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు.
అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం లభించలేదు. హోల్డర్ డకౌట్ కాగా.. రొమారియో షెఫర్డ్ (4), గుడకేష్ మోటి (10) ఆఖరి వరకు అజేయంగా నిలిచినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసిన వెస్టిండీస్.. విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఫలితంగా పర్యాటక పాకిస్తాన్ టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక పాక్ బౌలర్లలో హసన్ అలీ, మొహమ్మద్ నవాజ్, హ్యారీస్ రవూఫ్, సయీమ్ ఆయుబ్, సూఫియాన్ ముకీం ఒక్కో వికెట్ పడగొట్టారు.
కాగా గత టీ20 సిరీస్‌లో విండీస్.. ఆసీస్ చేతిలో సొంతగడ్డపై 5-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘మీరు మారరు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా విండీస్ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ఇంజక్షన్ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్ గిల్