ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026ను ఐదుసార్లు ఛాంపియన్ భారత్ ఘనంగా ఆరంభించింది. గురువారం బులవాయో వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో యువ భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో పేసర్ హెనిల్ పటేల్ కీలక పాత్ర. ఈ మ్యాచ్‌లో హెనిల్ పటేల్ తన సంచలన బౌలింగ్‌తో అమెరికాను బెంబేలెత్తించాడు.
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ తన మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ అమ్రీందర్ గిల్‌ను ఔట్ చేసి తన వికెట్ల వేటను మొదలు పెట్టాడు. మొత్తంగా హెనిల్ 7 ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో భారత బౌలర్‌గా హెనిల్ నిలిచాడు. దీంతో ఈ యువ సంచలనం గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
ఎవరీ హెనిల్ పటేల్?
హెనిల్ పటేల్.. ఫిబ్రవరి 28, 2007 న గుజరాత్‌లోని వల్సాద్‌లో జన్మించాడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనంలోనే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. అతడు అహ్మదాబాద్‌లోని ఓ క్రికెట్‌లో ఆకాడమీలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత హెనిల్ స్దానిక టోర్నీల్లో రాణించి గుజరాత్ అండర్-19 సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
గుజరాత్ అండర్-19, అండర్-23 జట్ల తరపున నిలకడడంతో రాణించడంతో ఇండియా-ఎ అండర్ 19 జట్టుకు అతడు ఎంపికయ్యాడు. అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో అండర్-19 ప్రపంచకప్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన తొలి వరల్డ్‌కప్ మ్యాచ్‌లోనే హెనిల్ సత్తాచాటాడు.
బంతిని లేట్ స్వింగ్ చేయడం హెనిల్‌కు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా బ్యాటర్లను ఇబ్బంది పెట్టే విధంగా బౌన్సర్లు కూడా సంధించగలడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే బుమ్రా వంటి దిగ్గజాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లు కనిపిస్తున్న ఈ యువ సంచలనం త్వరలోనే సీనియర్ జట్టుకు ఆడుతాడని క్రికెట్ నిపుణులు జోస్యం చెబుతున్నారు.
బుమ్రా వంటి స్పీడ్ స్టార్ కూడా గుజరాత్ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. హెనిన్ ఇప్పటివరకు భారత్ తరపున 3 యూత్ టెస్టులు, 12 యూత్ వన్డేలు ఆడి మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు. గత నెలలో జరిగిన అండర్-19 ఆసియా కప్‌లోనూ 4 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు.


