అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్‌ ముగిసిన తర్వాతే..: ధోని | "When This IPL Gets Over...": MS Dhoni Breaks Silence On His Future At IPL And Retirement | Sakshi
Sakshi News home page

అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్‌ ముగిసిన తర్వాతే..: ధోని

May 8 2025 10:02 AM | Updated on May 8 2025 10:56 AM

When This IPL Gets Over: MS Dhoni Breaks Silence On His Future At IPL

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ఊరట కలిగించింది. వరుస పరాజయాలు, పరాభవాల తర్వాత బుధవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)పై గెలిచింది. తద్వారా ఈ సీజన్‌లో ఎట్టకేలకు మూడో గెలుపు నమోదు చేసింది.

 ఏదీ కలిసిరాలేదు
ఈ నేపథ్యంలో కేకేఆర్‌పై విజయానంతరం సీఎస్‌కే కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సీజన్‌లో మేము కొన్ని మ్యాచ్‌లో మాత్రమే గెలిచాం. ఇది మాకు మూడో విజయం. ఏదేమైనా గెలవడం సంతోషంగానే ఉంటుంది కదా!

అయితే, ఈ ఏడాది మాకూ ఏదీ కలిసిరాలేదు. ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మా జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపైనే ప్రస్తుతం నా దృష్టి కేంద్రీకృతమై ఉంది.

వచ్చే ఏడాదైనా సరైన సమాధానం లభిస్తుందని భావిస్తున్నాం. ఏ బ్యాటర్‌ను ఏ స్థానంలో పంపాలి.. ఎవరైతే పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్‌ చేస్తున్నారన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అని ధోని పేర్కొన్నాడు.

అతడికి కృతజ్ఞతలు
అదే విధంగా.. ‘‘ఈ మ్యాచ్‌లో గెలుపునకు బ్రెవిస్‌ కారణం. అందుకు అతడికి కృతజ్ఞతలు. అతడి వల్లే ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. చక్కటి షాట్లతో బ్రెవిస్‌ అలరించాడు. అతడు బాదిన రెండు సిక్సర్ల వల్ల మాపై ఒత్తిడి తగ్గి విజయం దిశగా పయనం సాధ్యమైంది’’ అని ధోని సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్‌ బ్రెవిస్‌ను ప్రశంసించాడు.

అప్పుడే రిటైర్మెంట్‌
ఇక తన ఐపీఎల్‌ భవితవ్యం గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకిప్పుడు 43 ఏళ్లు. ఇప్పటికి చాలా ఏళ్లుగా నేను క్రికెట్‌ ఆడుతూనే ఉన్నాను. అయితే, ఈ లీగ్‌లో నా చివరి సంవత్సరం ఏది అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేను.

నిజానికి ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే ఇక్కడ క్రికెట్‌ ఆడతాం. ఒక్కసారి ఐపీఎల్‌ ముగిసిపోతే మరో 6-8 నెలలు నాకు విశ్రాంతి దొరుకుతుంది. నా శరీరం ఎంత వరకు ఒత్తిడిని తట్టుకుందనే అంశం మీదే అంతా ఆధారపడి ఉంది. 

ఇప్పటికైతే రిటైర్మెంట్‌ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమ, ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అని ధోని పేర్కొన్నాడు.

బ్రెవిస్‌ విధ్వంసం 
కాగా ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన చెన్నై తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రహానే సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లో నూర్‌ అహ్మద్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్‌ కాంబోజ్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక లక్ష్య ఛేదనలో చెన్నైకి ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు ఆయుశ్‌ మాత్రే, డెవాన్‌ కాన్వే డకౌట్‌ అయ్యారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఉర్విల్‌ పటేల్‌ 31 పరుగులతోరాణించగా.. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (25 బంతుల్లో 52) అద్బుత అర్ధ శతకంతో చెలరేగాడు.

ఆఖర్లో శివం దూబే (45), ధోని (17 నాటౌట్‌) రాణించడంతో.. చెన్నై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది మూడో గెలుపు. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ధోని సేన అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.

ఐపీఎల్‌-2025: కోల్‌కతా వర్సెస్‌ చెన్నై
👉వేదిక: ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా
👉టాస్‌: కోల్‌కతా.. తొలుత బ్యాటింగ్‌
👉కోల్‌కతా స్కోరు: 179/6 (20)
👉చెన్నై స్కోరు: 183/8 (19.4)
👉ఫలితం: రెండు వికెట్ల తేడాతో కోల్‌కతాపై చెన్నై గెలుపు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: నూర్‌ అహ్మద్‌ (చెన్నై స్పిన్నర్‌- 4/31).

Advertisement
 
Advertisement
Advertisement