జూన్ 11 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 9) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్ హోప్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ముగ్గురు టీ20 ప్రపంచకప్ 2026 సభ్యులకు చోటు దక్కలేదు.
ఇందులో ఇద్దరిపై (జాన్సన్ ఛార్లెన్, క్వింటన్ సాంప్సన్) వేటు పడగా.. అల్జరీ జోసఫ్‌కు వర్క్‌లోడ్ కారణంగా విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లు ఆకీమ్ ఆగస్టే, జువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్‌లకు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు.
విధ్వంసకర వీరులు హెట్‌మైర్, రూథర్‌ఫోర్డ్, షెపర్డ్, పావెల్, హోల్డర్ తమ స్థానాలను నిలుపుకున్నారు. శ్రీలంకతో ఈ సిరీస్ జూన్ 12, 14, 15 తేదీల్లో జమైకాలోని సబీనా పార్క్ వేదికగా జరుగనుంది.
శ్రీలంకతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టు
షాయ్ హోప్ (సి), జువెల్ ఆండ్రూ, అకీమ్ అగస్టే, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్
కాగా, శ్రీలంక క్రికెట్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు రెండో వన్డే కూడా వర్షార్పణం అయ్యింది. ఈ సిరీస్‌లో జరిగిన ఏకైక వన్డేలో గెలవడంతో శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుంది.
స్వదేశంలో సిరీస్ కోల్పోవడంతో విండీస్ జట్టు 2027 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. 2023-27 సైకిల్‌లో విండీస్ ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్‌గా టోర్నీలోకి అడుగుపెడతాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు-నవంబరు మధ్య జరుగనున్న సంగతి తెలిసిందే.


