భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్, టీమిండియా 'క్వీన్' స్మృతి మంధన (Smriti Mandhana) త్వరలో పెళ్లి పీఠలెక్కబోతుందన్న ప్రచారం నిజమైంది. సంగీత దర్శకుడు, సింగర్ పాలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) నిశ్చితార్థాన్ని మంధన స్వయంగా ధృవీకరించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సహచరి జెమిమా రోడ్రిగ్స్ షేర్ చేసిన వీడియోలో మంధన తన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ మున్నా భాయ్ MBBS సినిమాలోని "సమ్జో హో హీ గయా" పాటకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను మంధన స్వయంగా రీపోస్ట్ చేస్తూ, ముచ్చల్‌తో తన నిశ్చితార్థాన్ని అఫీషియల్ చేసింది.

మంధన-ముచ్చల్ 2019లో స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. సంగీతం, క్రీడలపై ఆసక్తి వారిని దగ్గర చేసింది. ఐదు సంవత్సరాల డేటింగ్ అనంతరం 2024లో వీరు తమ అనుబంధాన్ని బహిర్గతం చేశారు. ముచ్చల్ తరచూ మంధన ఆడే మ్యాచ్‌లలో కనిపిస్తూ ఆమెకు మద్దతు పలుకుతుంటాడు.

మంధన-ముచ్చల్ వివాహా తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సోషల్‌మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక వైరలవుతుంది. దీని ప్రకారం వీరి పెళ్లి మరికొద్ది రోజుల్లో (నవంబర్ 23న) జరగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, సాంగ్లీల్లో జరుగనున్నట్లు తెలుస్తుంది.

ఇందుకు సన్నాహకాలు కూడా పూర్తయ్యాయని సమాచారం. మంధన ఇటీవలే భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. జగజ్జేతగా నిలిచిన కొద్ది రోజుల్లోనే మంధన జీవితంలో మరో పెద్ద విజయోత్సవం జరగడం ఖాయమైంది. మంధన-ముచ్చల్ వివాహాం క్రికెట్‌తో పాటు సంగీత అభిమానుల్లోనే ఆనందాన్ని నింపనుంది.


