
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో నేడు జరగాల్సిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్ రద్దైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంగ్లాండ్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 9గం. భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సి ఉంది. అయితే పాక్‌తో మ్యాచ్‌ను భారత ప్లేయర్లు బాయ్‌కాట్ చేసిన నేపథ్యం, ప్రజల మనోభావాలు దెబ్బ తిన్న నేపథయంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పాయింట్ల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ ఆడకూడదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు డబ్ల్యూసీఎల్‌లో ఇరు జట్లూ తలపడనున్న నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు.. పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు మాజీ క్రికెటర్లకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ? ప్రశ్నలు తలెత్తాయి.
Dear all , pic.twitter.com/ViIlA3ZrLl
— World Championship Of Legends (@WclLeague) July 19, 2025
ఈ నేఫథ్యంలో.. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా, మాజీ ఆల్‌రౌండర్లు ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్‌లు డబ్ల్యూసీఎల్ 2025లో పాకిస్తాన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. పహల్గామ్ దాడి, ఆ తరువాత జరిగిన పరిణామాలు వారి నిర్ణయంకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ నుంచి తప్పుకున్నారని స్పష్టమైంది.
ఈ మ్యాచ్‌లో తాను ఆడేది లేదని.. సదరు విషయాన్ని డబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్లకు ఇప్పటికే చెప్పినట్లు శిఖర్ ధావన్ వెల్లడించాడు. మే 11నే లీగ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు మెయిల్ స్క్రీన్‌షాట్‌లను ధావన్ పంచుకున్నాడు. ‘‘ఈ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నాకు నా దేశమే ముఖ్యం. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. జై హింద్’’ అని మెయిల్ స్క్రీన్‌షాట్‌ను ధావన్ పోస్టు చేశాడు.
ఇంకోవైపు.. పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారత్‌పై, భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయగా దుమారం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్రిదీపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు వేటు వేసినట్లు తెలుస్తోంది. డబ్ల్యూసీఎల్ పోస్టర్ నుంచి అఫ్రిదీ ఫొటోను నిర్వాహకులు తొలగించారు. మిగతా మ్యాచ్‌లకూ అతన్ని దూరం పెట్టే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.