వరంగల్ వారియర్స్ సహ యజమాని వరుణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టి20 లీగ్ మున్ముందు పెద్ద స్థాయికి చేరే అవకాశం ఉందని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే తాము జత కట్టామని వరంగల్ వారియర్స్ సహ యజమాని వరుణ్ జూపల్లి అన్నారు. ఎంతో మంది ప్రతిభ గల యువ ఆటగాళ్లు సరైన అవకాశం ఎదురు చూస్తున్నారని, తొలి సీజన్‌లో ఇప్పటి వరకు లభిస్తున్న స్పందనను చూస్తే లీగ్ విజయవంతమైనట్లుగా చెప్పవచ్చని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
‘మా సన్నిహితులు అమెరికాలోని మేజర్ క్రికెట్ లీగ్‌లోని ఒక జట్టులో సహ యజమానిగా ఉన్నారు. ఆ కారణంగా టీజీ టి20లో టీమ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన కలిగింది. క్రికెట్‌పై ఆసక్తితో పాటు మన వద్ద జరుగుతున్న టోర్నీలో భాగమైతే బాగుంటుందని ముందుకు వచ్చాం. ఇందులో లాభాల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. రాబోయే సీజన్లలో లీగ్ మరింత పెద్ద స్థాయికి చేరుతుంది’ అని వరుణ్ వ్యాఖ్యానించారు. టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడినా... వరంగల్ టీమ్ అన్ని విధాలా పటిష్టంగా ఉందని వరుణ్ చెప్పారు.
ముఖ్యంగా పేరాల అమన్ రావు అద్భుత ప్రదర్శనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘అమన్ సూపర్ షాట్స్ ఆడాడు. సాధికారికంగా అతను బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే ఐపీఎల్‌లోకి ఎందుకు ఎంపికయ్యాడో తెలుస్తుంది. అమన్ మాత్రమే కాకుండా ఇతర కుర్రాళ్లపై కూడా మాకు నమ్మకం ఉంది. లీగ్‌లో వారియర్స్ మంచి ఫలితాలు సాధించడం ఖాయం’ అని వరుణ్ వెల్లడించారు. బీసీసీఐ అనుమతించిన నిబంధనల ప్రకారం భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉండటంతో తొలి మ్యాచ్ ఆడలేదని... తర్వాతి మ్యాచ్‌లలో అతను బరిలోకి దిగుతాడని వరుణ్ స్పష్టం చేశారు.


