విండీస్‌ వీరుడి విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే శతకం | Walton slams ton as Harbhajan's Delhi Warriors beat Dhawan's Dubai Royals in opening game of World Legends Pro T20 League | Sakshi
Sakshi News home page

విండీస్‌ వీరుడి విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే శతకం

Jan 27 2026 4:22 PM | Updated on Jan 27 2026 4:38 PM

Walton slams ton as Harbhajan's Delhi Warriors beat Dhawan's Dubai Royals in opening game of World Legends Pro T20 League

క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో టీ20 లీగ్‌ ప్రారంభమైంది. వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్‌ పేరిట భారత్‌లో అరంగేట్రం చేసిన ఈ లీగ్‌.. నిన్ననే (జనవరి 26) మొదలైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌, గుర్‌గ్రామ్‌ థండర్స్‌, మహారాష్ట్ర టైకూన్స్‌, పూణే పాంథర్స్‌, రాజస్థాన్‌ లయన్స్‌) పాల్గొంటున్నాయి.

పది రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధవన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, డేల్‌ స్టెయిన్‌ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.

లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌ తలపడ్డాయి. ప్రారంభ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదైంది. ఢిల్లీ వారియర్స్‌కు ఆడుతున్న విండీస్‌ ఆటగాడు చాడ్విక్‌ వాల్టన్‌ కేవలం 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఫలితంగా అతని జట్టు దుబాయ్‌ రాయల్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. పీటర్‌ ట్రెగో (60), కిర్క్‌ ఎడ్వర్డ్స్‌ (41), అంబటి​ రాయుడు (36), కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (26) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూసఫ్‌ పఠాన్‌ (2), రిషి ధవన్‌ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వారియర్స్‌ బౌలర్లలో సుభోత్‌ భాటి 3, హర్భజన్‌ సింగ్‌ 2, ఇసురు ఉడాన ఓ వికెట్‌ తీశారు.

అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్‌ సునాయాసంగా ఛేదించింది. చాడ్విక్‌ వాల్టన్‌ (62 బంతుల్లో 128; 14 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో వారియర్స్‌ను కేవలం 16.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఓపెనర్‌ శ్రీవట్స్‌ గోస్వామి (56) సహకరించాడు. వారియర్స్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ పియుశ్‌ చావ్లాకు దక్కింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement