నెయ్‌మార్ లేకపోతే ఇంతేనా? మొరాకో దెబ్బకు బ్రెజిల్ విలవిల | Vinicius Junior Earns Brazil Draw With Morocco In FIFA World Cup Opener | Sakshi
Sakshi News home page

FIFA World Cup: నెయ్‌మార్ లేకపోతే ఇంతేనా? మొరాకో దెబ్బకు బ్రెజిల్ విలవిల

Jun 14 2026 8:57 AM | Updated on Jun 14 2026 12:07 PM

Vinicius Junior Earns Brazil Draw With Morocco In FIFA World Cup Opener

ఫిఫా ప్రపంచకప్‌-2026లో ఫైవ్ టైమ్‌ ఛాంపియన్ బ్రెజిల్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. న్యూజెర్సీ వేదికగా మొరాకోతో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌ను బ్రెజిల్ డ్రాగా ముగించింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దాదాపుగా ప్ర‌తీ ఎడిష‌న్‌ మొద‌టి మ్యాచ్‌లో విజ‌యం సాధించే బ్రెజిల్.. ఈసారి డ్రా చేసుకోవ‌డాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. 

నెయ్‌మార్ జూనియ‌ర్ లేని లోటు బ్రెజిల్ జ‌ట్టులో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గాయం కార‌ణంగా అత‌డు టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. కెప్టెన్ మార్క్విన్హోస్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే మొరాకో జ‌ట్టు దూకుడుగా ఆడింది. అచ్రాఫ్ హకీమి, నీల్ ఎల్ ఐనౌయి వ‌రుస‌గా గోల్ పోస్ట్‌ను టార్గెట్ చేస్తూ బ్రెజిల్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. 

ఈ క్ర‌మంలోనే మ్యాచ్ 21వ నిమిషంలో మొరాకో ఫార్వర్డ్ ఆటగాడు ఇస్మాయిల్ సైబారీ.. బ్రెజిల్ డిఫెండర్లు మార్క్విన్హోస్, గాబ్రియెల్ మగల్హాస్‌లను బోల్తా కొట్టిస్తూ అద్భుత‌మైన గోల్‌ను సాధించాడు. దీంతో మొరాకో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ త‌ర్వాత 32వ నిమిషంలో బ్రెజిల్‌ స్టార్ వినీషియస్ జూనియర్ సూప‌ర్ గోల్‌తో స్కోర్‌ను 1-1 స‌మం చేశాడు.

సెకెండ్ హాఫ్‌లో ఇరు జ‌ట్లు కూడా క‌నీసం ఒక్క గోల్ కూడా సాధించ‌లేక‌పోయాయి. బ్రెజిల్ సూప‌ర్ స్టార్లు రాఫిన్హా, డానిలో, ఇగోర్ థియాగోలు వంటి  చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.  మ్యాచ్ చివరి నిమిషాల్లో మొరాకో ఆటగాడు ఎల్ ఐనౌయి కొట్టిన లాంగ్-రేంజ్ షాట్‌ను బ్రెజిల్ గోల్ కీపర్ అలిసన్ అద్బుతంగా ఆడ్డుకుని త‌న జ‌ట్టును ఓట‌మి నుంచి కాపాడాడు.

కాగా 1934 నుంచి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌మ‌ మ్యాచ్‌లో బ్రెజిల్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మార్క్విన్హోస్ సేన‌  ఈ డ్రాతో త‌న అజేయ రికార్డు అలాగే కొన‌సాగించింది.  బ్రెజిల్ తన తదుపరి మ్యాచ్‌లో హైతీతో తలపడనుండగా, మొరాకో జట్టు స్కాట్లాండ్‌ను ఎదుర్కోనుంది.
చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement