ప్రధాన స్పాన్సర్‌గా శ్రీనిధి యూనివర్సిటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ (టీజీ) టి20 టోర్నమెంట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా శ్రీనిధి యూనివర్సిటీ వ్యవహరించనుంది. మూడేళ్ల పాటు ఈ టోర్నీకి స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు హెచ్‌సీఏతో శ్రీనిధి యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 21 నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో సీజన్–1 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 8 టీమ్‌లు బరిలోకి దిగుతుండగా... తొలి పోరులో పాలమూరు స్ట్రయికర్స్‌తో ఖమ్మం ఏసెస్ జట్టు తలపడుతుంది.
జూలై 12న ఫైనల్ నిర్వహిస్తారు. భారత ఆటగాళ్లు తిలక్ వర్మ (మెదక్), మొహమ్మద్ సిరాజ్ (వరంగల్) కూడా ఈ టోర్నమెంట్‌లో మెదక్, వరంగల్ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. బ్రాండ్ అంబాసిడర్ హోదాలో లీగ్‌కు ప్రచారం కల్పించేందుకు యువ హీరో విజయ్ దేవరకొండ కూడా సిద్ధమయ్యాడు. ‘దిగ్గజ ఆటగాళ్లంతా తమకంటూ గుర్తింపు రాని రోజుల్లో ఒక పెద్ద కల కని ఉంటారు. ఇప్పుడు టీజీ టి20లో ఆడే కుర్రాళ్లంతా అలాంటి కలతోనే బరిలోకి దిగుతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ క్రికెటర్లు సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు.
ప్రతిభను ప్రోత్సహిస్తున్న ఇలాంటి లీగ్‌తో జత కట్టడం సంతోషంగా ఉంది’ అని విజయ్ దేవరకొండ వీడియో మెసేజ్ ఇచ్చాడు. ప్రారంభోత్సవం రోజున మ్యాచ్‌కు ముందు సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. ఆసక్తి గల అభిమానులు నేటి నుంచి ‘డిస్ట్రిక్ట్ ’ యాప్ ద్వారా మ్యాచ్‌ల టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టీజీ టి20 లీగ్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. మంగళవారం జరిగిన కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి, లీగ్ చైర్మన్ ఆగం రావు తదితరులు పాల్గొన్నారు.


