కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. పర్యాటక జట్టు నిర్ధేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది. 35 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది.
సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో కేశవ్ మహారాజ్, జానెసన్ తలా రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గాయపడి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్‌కు రాలేదు. గిల్ లేకపోవడం కూడా భారత జట్టుకు చాలా నష్టాన్ని కలిగించిందే అని చెప్పాలి.
నాలుగో స్ధానానికి పడిపోయిన భారత్..
ఇక భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు ఫలితంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్ధానం నుంచి నాలుగో స్ధానానికి పడిపోయింది. భారత్ పాయింట్ల శాతం 54.17గా ఉంది.
ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత జట్టు 8 మ్యాచ్‌లు ఆడి నాలుగింట గెలుపొందగా.. మూడింట ఓటమి చవిచూసింది. మరోవైపు ఈ విజయంతో దక్షిణాఫ్రికా(66.7 శాతం) రెండో స్ధానానికి దూసుకెళ్లింది. అయితే పీసీటీ పరంగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సమంగా ఉన్నాయి.
కానీ పాయింట్లు పరంగా మాత్రం లంక(16) కంటే సౌతాఫ్రికా(24) ముందుంజలో ఉంది. అందుకే శ్రీలంక మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా(100.00) అగ్రస్ధానంలో ఉంది. ఈ సైకిల్‌లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. సౌతాఫ్రికా ఆడిన 3 మ్యాచ్‌లలో 2 విజయాలు, ఒక్క ఓటమి చవిచూసింది.
చదవండి: సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్


