టీమిండియా- వెస్టిండీస్ మధ్య బుధవారం నాటి నాలుగో టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మీడియాతో మాట్లాడాడు.
మునుపెన్నడూ చూడని రనౌట్ అంటూ విమర్శలు
విండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తాను రనౌట్ అయిన తీరుపై వస్తున్న విమర్శలపై ఈ సందర్భంగా స్పందించాడు. కాగా ఇండోర్ మ్యాచ్‌లో తిలక్ వర్మ 16 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. అయితే, టీమిండియా ఇన్నింగ్స్‌లో పదిహేడో ఓవర్లో గుడకేశ్ మోటీ బౌలింగ్‌కు రాగా.. నాలుగో బంతిని అక్షర్ పటేల్ బౌండరీ దిశగా తరలించాడు.
ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న తిలక్ వర్మతో కలిసి అక్షర్ సింగిల్‌కు వెళ్లాడు. ఆ సమయంలో బంతి బౌండరీని తాకిందని పొరపడి.. ఇద్దరూ పంచ్‌లు ఇచ్చుకుని సెలబ్రేట్ చేసుకోగా.. ఫీల్డర్ కామిల్ పూరన్ మాత్రం అనూహ్య రీతిలో బంతి బౌండరీ తాకకుండా ఆపాడు.
అంతేగాక దానిని వికెట్ కీపర్, కెప్టెన్ షాయీ హోప్ వైపు విసరగా.. అక్షర్ పటేల్ అప్పటికే క్రీజులోకి వచ్చాడు. కానీ తిలక్ వర్మ మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ క్రీజు వైపు కదిలాడు. అంతలోనే పాదరసంలా కదిలిన కరేబియన్ ఆటగాళ్లు వికెట్లను బంతితో గిరాటేయడంతో తిలక్ వర్మ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
𝐖𝐀𝐈𝐓, 𝐖𝐇𝐀𝐓 𝐉𝐔𝐒𝐓 𝐇𝐀𝐏𝐏𝐄𝐍𝐄𝐃?! 🤯 A near-boundary save turns into a run-out as the West Indies catch Tilak Varma short of his crease! #INDvWI 3rd T20I | LIVE NOW 👉 https://t.co/GmwwFjql5J https://t.co/plCeyKV5SE
— Star Sports (@StarSportsIndia) October 11, 2026
నిద్రపోతున్నావా?
ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు.. ‘మైదానంలో నిద్రపోతున్నావా? ఇవన్నీ చిన్న పిల్లల చేష్టలు’ అంటూ తిలక్ వర్మను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ విషయంపై తాజాగా స్పందిస్తూ.. ‘‘నేను రనౌట్ అయిన విధానం గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు.
అక్షర్ కూడా అలానే జరిగిందనుకున్నాడు
నిజానికి బౌండరీ వెనుక హోర్డింగ్స్ ఉన్నాయి. అప్పుడు అక్కడ ఓ ఫ్లాష్ వచ్చింది. కాబట్టి బంతి హోర్డింగ్‌ను తాకిందని నేను భావించాను. నేనే కాదు.. అక్షర్ కూడా అలానే జరిగిందనుకున్నాడు. అందుకే ఇద్దరం మధ్యలోనే కాసేపు ఆగిపోయాము. బంతి బౌండరీకి తాకిందనే అనుకున్నాము.
కానీ దురదృష్టవశాత్తూ.. అప్పటికే బంతిని అక్షర్ ఎండ్ వైపు విసిరారు. నేను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాను. కాబట్టి బంతిని చూడలేకపోయాను. అప్పటికే మా జట్టు ఆటగాళ్లు బయటి నుంచి గట్టిగా కేకలు వేస్తూనే ఉన్నారు. నన్ను త్వరగా క్రీజులోకి వెళ్లమన్నారు.
అందుకే నేను నింపాదిగా నడుచుకుంటూ వెళ్లాను
ఒకవేళ అక్షర్‌కు అయినా వాళ్లు రనౌట్ చేస్తారనే ఐడియా ఉంటే నన్ను కచ్చితంగా వేగంగా పరిగెత్తమని చెప్పేవాడే. కానీ మేము బంతి బౌండరీకి వెళ్లిందని భావించాము. అందుకే నేను నింపాదిగా నడుచుకుంటూ వెళ్లాను. అది అలా జరిగిపోయింది.
అయితే, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాను. అంపైర్ బౌండరీలకు సంబంధించి సిగ్నల్ ఇచ్చేంత వరకు వికెట్ల మధ్య పరుగు ఆపను. సరైన సమయంలో క్రీజులోకి చేరుకుంటా’’ అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఇండోర్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై పద్నాలుగు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.


