బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌ సింగ్‌.. ప్రకటన విడుదల | IPL 2027: Yuvraj Singh joins Delhi Capitals as batting coach | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌ సింగ్‌.. ప్రకటన విడుదల

Oct 13 2026 7:31 PM | Updated on Oct 13 2026 8:00 PM

IPL 2027: Yuvraj Singh joins Delhi Capitals as batting coach

యువరాజ్‌ సింగ్‌ (PC: DC X)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2027 సీజన్‌ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక ప్రకటన చేసింది. టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను తమ బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించినట్లు ప్రకటించింది. అదే విధంగా.. హెడ్‌కోచ్‌ సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలో అసిస్టెంట్‌ కోచ్‌గానూ యువీ సేవలు అందిస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం తెలిపింది.

చాంపియన్‌ ప్లేయర్‌
కాగా 44 ఏళ్ల యువీ దిగ్గజ ఆటగాడిగా పేరొందాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీలను భారత్‌ సొంతం చేసుకోవడంలో ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ది కీలక పాత్ర. క్యాన్సర్‌ మహమ్మారి జయించి మరీ క్రికెటర్‌గా ప్రయాణం కొనసాగించిన యువీ.. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

యువ ఆటగాళ్ల మెంటార్‌
ఇక ఐపీఎల్‌-2015 సీజన్లో ఢిల్లీ ఫ్రాంఛైజీ యువరాజ్‌ సింగ్‌ను ఏకంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా అప్పట్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా యువీ నిలిచాడు. ఆ సీజన్‌లో ఢిల్లీ తరఫున పద్నాలుగు మ్యాచ్‌లు ఆడి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. యువ క్రికెటర్లు, స్టార్లుగా ఎదిగిన అభిషేక్‌ శర్మ, టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ వంటి వారికి యువీ మెంటార్‌గా వ్యహరించాడు.

కోచ్‌గా కొత్త ప్రయాణం
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికై.. ఐపీఎల్‌లో తొలిసారి పూర్తిస్థాయి కోచ్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు యువీ. ఈ సందర్భంగా.. క్యాపిటల్స్‌తో కలిసి తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. ఢిల్లీ జట్టు యాజమాన్యంతో చాలా ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయని యువీ తెలిపాడు. 

ఇది తనకు దక్కిన ఓ ప్రత్యేక అవకాశమని పేర్కొన్నాడు. ఇక యువీకి స్వాగతం పలుకుతూ సౌరవ్‌ గంగూలీ ‘టైగర్‌’గా అతడిని అభివర్ణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

చదవండి: జట్టును వీడిపోండి.. లేదంటే రిటైర్‌ అవ్వండి: యువీ, గంభీర్‌ కెరీర్లు అలా ఖతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement