యువరాజ్ సింగ్- గౌతం గంభీర్ (PC: BCCI)
టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా తానున్న సమయంలో సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్ వంటి దిగ్గజ క్రికెటర్లు బలవంతంగా జట్టుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని తెలిపాడు. అయితే, ఆ సమయంలో తానొక్కడినే ఏ నిర్ణయం తీసుకోలేదని.. కమిటీ ఏకాభిప్రాయంతోనే నాడు చర్యలకు ఉపక్రమించిందని పేర్కొన్నాడు.
సంధి దశలో ఉన్న వేళ
కాగా 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సందీప్ పాటిల్.. 2012-2016 మధ్య టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా పనిచేశాడు. భారత జట్టు సంధి దశలో ఉన్న వేళ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఆ సమయంలోనే దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ (2013), పేసర్ జహీర్ ఖాన్ (2015) రిటైర్ కాగా.. లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, స్టార్ ఓపెనర్ గౌతం గంభీర్ జట్టుకు దూరమైపోయారు. గత జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్న సందీప్ పాటిల్ దూరదర్శన్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అవేమీ నా సొంత నిర్ణయాలు కావు
‘‘ముందుగా ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. అప్పటి సెలక్షన్ ప్యానెల్‌లోని ఐదుగురు సభ్యులు కలిసే నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు నేను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్నానంతే. అంతేతప్ప అవేమీ నా సొంత నిర్ణయాలు కావు.
జట్టును వీడటం లేదంటే రిటైర్ అవ్వడం
ఏదేమైనా... భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మేము అప్పుడు నిర్ణయాలు తీసుకున్నాము. అయితే, నాటి నిర్ణయాల గురించి ఈరోజు మాట్లాడాల్సి రావడం కాస్త ఇబ్బందిగానే ఉంది. అయితే, సచిన్ టెండుల్కర్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజాలకు నాడు జట్టును వీడటం లేదంటే రిటైర్ అవ్వడం అనే రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి.
ఇందుకు గల కారణాలు ఏమిటో వారికి కూడా బాగా తెలుసు. సెలక్టర్లుగా దేశం తరఫున ఆడే జట్టు, బీసీసీఐ, భారత క్రికెట్ ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యం. ఆటగాళ్లతో మనకు స్నేహం ఉండొచ్చు. అయితే, స్నేహానికి, విధులకు మధ్య సన్నని గీత ఉంటుంది.
ఫ్రెండ్ కాబట్టి టీమిండియాకు సెలక్ట్ చేయలేం
‘నా స్నేహితుడు కాబట్టి ఇతడిని జట్టులోకి తీసుకుంటా’ అనే పరిస్థితి ఉండదు. మనకు ఇచ్చిన బాధ్యతను వంద శాతం నిబద్ధతతో పూర్తి చేయాల్సి ఉంటుంది. జట్టు విషయంలో సొంత నిర్ణయాలకు తావు ఉండదు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటాము.
అయితే, ఒక్కోసారి మన నిర్ణయాలు అందరికీ నచ్చకపోవచ్చు. అయినంత మాత్రాన జట్టు ప్రయోజనాలను పణంగా పెట్టలేము’’ అని సందీప్ పాటిల్ చెప్పుకొచ్చాడు. కాగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విషయంలో చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ కఠిన వైఖరి ప్రదర్శించాడనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇటీవలే అగార్కర్ చీఫ్ సెలక్టర్ పదవికి దూరం కాగా.. అతడి స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇలాంటి తరుణంలో సందీప్ పాటిల్ తాను చీఫ్ సెలక్టర్‌గా ఉన్న సమయంలోనూ దిగ్గజాలు జట్టుకు దూరమయ్యారని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాము కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పడం గమనార్హం.
చదవండి: చరిత్ర సృష్టించిన గిల్.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు


