చ‌రిత్ర సృష్టించిన గిల్‌.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు | Gill Becomes 1st-Ever-Player-5-Times ICC Mens Player Of Month Winner | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన గిల్‌.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు

Oct 13 2026 11:51 AM | Updated on Oct 13 2026 12:22 PM

Gill Becomes 1st-Ever-Player-5-Times ICC Mens Player Of Month Winner

Photo Credit: Twitter

సెప్టెంబ‌ర్ నెల‌కు గానూ పురుషుల ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ కైవ‌సం చేసుకున్నాడు. త‌నతో పాటు నామినీలుగా ఉన్న స‌హ‌చ‌ర క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌, జింబాబ్వే కెప్టెన్ సికంద‌ర్ ర‌జాల‌ను వెన‌క్కి నెట్టిన గిల్‌ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇటీవ‌లే వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో అజేయ డ‌బుల్ సెంచ‌రీ స‌హా శ‌త‌కంతో మెరిసిన గిల్ 333 ప‌రుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా, ఆఖ‌రి వ‌న్డేలో ఓడిన‌ప్ప‌టికీ 2-1 తేడాతో వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.

ఐదోసారి అవార్డు..
ఇక ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును గిల్ గెలుచుకోవ‌డం ఇది ఐదోసారి. గ‌తంలో2023లో జ‌న‌వ‌రి, సెప్టెంబ‌ర్ నెల‌ల్లో, 2025లో ఫిబ్ర‌వ‌రి, జూలై నెల‌ల్లో ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డులు ద‌క్కించుకున్నాడు. ఈ నేప‌థ్యంలో అత్య‌ధికసార్లు ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డులు గెలుచుకున్న ఏకైక క్రికెట‌ర్‌గా గిల్ చ‌రిత్ర సృష్టించాడు. 

భారత పురుషుల విభాగంలో చివరిసారిగా ఈ అవార్డును మార్చి 2026లో సంజు సామ్సన్ గెలుచుకున్నారు. గిల్ సాధించిన ఐదు విజయాలతో కలిపి, ఇప్పటివరకు 11 మంది ఆటగాళ్లు ఈ అవార్డును 17 సార్లు గెలుచుకోవ‌డం విశేషం.

ఈ అవార్డుపై గిల్ స్పందించాడు. “ఐదోసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం అద్భుతంగా అనిపిస్తోంది. ఈ గౌరవాన్ని నాకిచ్చిన‌ ప్యానెల్‌కు నేను కృతజ్ఞుడను. విండీస్‌తో వ‌న్డే సిరీస్‌లో పరుగులు సాధించడం ఎంతో సంతృప్తినిచ్చింది. మా సొంత అభిమానుల ముందు అజేయ డ‌బుల్ సెంచ‌రీతో ఛేజింగ్‌లో భాగం కావడం నాకు మ‌రింత ప్ర‌త్యేకం. వాళ్లిచ్చే మద్దతు నాకు ఎల్లప్పుడూ అదనపు ఉత్సాహాన్ని ఇస్తుంది," అని చెప్పుకొచ్చాడు.

షెఫాలీదే అవార్డు..
ఇక మ‌హిళ‌ల విభాగంలో టీమిండియా సంచ‌ల‌నం షెఫాలీ వ‌ర్మ సెప్టెంబ‌ర్ నెల‌కు గానూ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు ద‌క్కించుకుంది. ఇటీవ‌లే జ‌రిగిన మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో షెఫాలీ వ‌ర్మ 184.61 స్ట్రైక్‌రేట్‌తో 360 ప‌రుగులు సాధించ‌డంతో పాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీసింది. 

అంతేకాదు ఆసియా గేమ్స్‌లో భార‌త్ స్వ‌ర్ణం గెల‌వ‌డంలోనూ షెఫాలీ వ‌ర్మ‌ది కీల‌క‌పాత్ర‌. సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌పై అజేయ సెంచ‌రీ (100 నాటౌట్‌) సాధించిన షెఫాలీ.. శ్రీలంక‌తో జ‌రిగిన ఫైన‌ల్లో 48 ప‌రుగుల కీల‌క ఇన్నింగ్స్ ఆడింది. ఇక షెఫాలీ వ‌ర్మ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్‌గా నిల‌వ‌డం ఇది రెండోసారి. గ‌తంలో 2025 న‌వంబ‌ర్ నెల‌లోనూ ఈ అవార్డు ద‌క్కించుకుంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement